రాయలసీమ న్యూస్, స్పోర్ట్స్ డెస్క్: జూనియర్ ఆసియా కప్ హాకీ టోర్నమెంట్‌లో భారత్ జోరు కొనసాగుతోంది. చైనా లోని మోఖి వేదికగా మంగళవారం జరిగిన పూల్-ఎ మ్యాచ్‌లో భారత్ జట్టు 7-3 తేడాతో కొరియాపై ఘనవిజయం సాధించింది. కెప్టెన్ అన్మోల్ ఎక్కా రెండు గోల్స్‌తో ముందుండి నడిపించగా, చివరి క్వార్టర్‌లో భారత ఆటగాళ్ల దూకుడు కొరియా జట్టును పూర్తిగా తేలిగ్గా చేసింది.
మ్యాచ్ ఆరంభం నుంచే రెండు జట్లు బలమైన పోరాటాన్ని ప్రదర్శించాయి. 5వ నిమిషంలో అన్మోల్ గోల్‌తో భారత్ ముందంజలోకి వెళ్లింది. అయితే వెంటనే 6వ నిమిషంలో చోయ్ కొరియా తరఫున గోల్ సాధించడంతో స్కోరు 1-1గా సమమైంది. తొలి రెండు క్వార్టర్లలో ఆట హోరాహోరీగా సాగింది.
18వ నిమిషంలో లవ్‌నూర్ సింగ్, 20వ నిమిషంలో అజీత్ సింగ్ భారత్ తరఫున గోల్స్ సాధించారు. కొరియా జట్టుకు చెందిన యూ హొగుక్ 19వ, 36వ నిమిషాల్లో రెండు గోల్స్ నమోదు చేయడంతో స్కోరు 3-3గా మారింది. ఈ దశ వరకు మ్యాచ్ పూర్తిగా సమాన స్థాయిలో కొనసాగింది.
చివరి క్వార్టర్‌లో భారత్ దాడులు మరింత ఉధృతం అయ్యాయి. 42వ నిమిషంలో ప్రభ్‌దీప్ సింగ్ మెరుపు గోల్‌తో భారత్ 4-3 ఆధిక్యంలోకి వెళ్లింది. అనంతరం 55వ నిమిషంలో గురుసేవక్, 56వ నిమిషంలో అన్మోల్, 58వ నిమిషంలో ఆర్యన్ వరుసగా గోల్స్ సాధించడంతో భారత్ 7-3తో విజయం ఖాయం చేసుకుంది.
పూల్-ఎలో భారత్ ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడి, రెండు విజయాలు, ఒక డ్రాతో 7 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో ఉంది. బుధవారం చైనీస్ తైపీపై భారత్ గెలిస్తే అన్మోల్ ఎక్కా సారథ్యంలోని జట్టు సెమీఫైనల్ బెర్త్‌ను సొంతం చేసుకునే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే, మహిళల జూనియర్ ఆసియా కప్ హాకీ టోర్నమెంట్‌లో భారత అమ్మాయిల జట్టు క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఎలైట్ పూల్ మ్యాచ్‌లో జపాన్‌ను 7-0 తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్ మొత్తం భారత్‌దే ఆధిపత్యం.
5వ నిమిషంలో కృష్ణ శర్మ గోల్‌తో భారత్ ముందంజలోకి వెళ్లింది. 9వ నిమిషంలో సుప్రియ, 14వ నిమిషంలో పూర్ణిమ యాదవ్ గోల్స్ సాధించడంతో సగం ఆట ముగిసే సమయానికి భారత్ 3-0తో స్పష్టమైన ఆధిక్యంలో నిలిచింది.
ఆఖరి క్వార్టర్స్‌లో భారత్ మరింత చెలరేగింది. గీత యాదవ్ 41వ, 45వ నిమిషాల్లో రెండు గోల్స్ నమోదు చేసింది. 46వ నిమిషంలో పూర్ణిమ యాదవ్, 50వ నిమిషంలో సనిక గోల్స్ సాధించడంతో స్కోరు 7-0గా నిలిచింది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించిన భారత్ 9 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది.







