రాయలసీమ న్యూస్, ఆంధ్రప్రదేశ్ డెస్క్: ఉండవల్లి: జపాన్‌లో జరిగిన ఏషియన్ గేమ్స్-2026లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి ఆర్చరీ కాంపౌండ్ మహిళల టీమ్ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన ప్రఖ్యాత ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ, ఆమె తండ్రి సురేంద్రకుమార్‌తో కలిసి సోమవారం విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ను ఉండవల్లి నివాసంలో కలిశారు.
ఏషియన్ గేమ్స్‌లో ఇప్పటివరకు నాలుగు గోల్డ్ మెడల్స్‌తో పాటు మొత్తం ఆరు పతకాలు సాధించి జ్యోతి సురేఖ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. తాజా ఏషియన్ గేమ్స్‌లో తన ప్రతిభతో స్వర్ణం కైవసం చేసుకున్న జ్యోతి సురేఖను మంత్రి లోకేష్ ప్రత్యక్షంగా అభినందించారు.
అంతర్జాతీయ వేదికపై మువ్వన్నెల జెండాను రెపరెపలాడించి దేశానికి, రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారని మంత్రి ప్రశంసించారు. జ్యోతి సురేఖ సాధించిన విజయాలు తెలుగు రాష్ట్రాల యువ క్రీడాకారులకు ప్రేరణగా నిలుస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
2028 ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని జ్యోతి సురేఖకు మంత్రి సూచించారు. ఆమె భవిష్యత్ క్రీడా ప్రయాణంలో అన్నివిధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయం, ప్రోత్సాహం అందించేందుకు తాము కట్టుబడి ఉన్నామని లోకేష్ స్పష్టం చేసినట్లు సమాచారం.
జ్యోతి సురేఖ ఇప్పటివరకు సాధించిన విజయాలపై మంత్రి లోకేష్ వివరాలు తెలుసుకుని, ఆమె కృషి, పట్టుదలపై ప్రశంసలు కురిపించారు. అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని పతకాలు సాధించి భారత క్రీడా రంగాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.







