ఎంబాపె మెరుపు.. ఫ్రాన్స్‌, మెక్సికో, ఇంగ్లాండ్‌ ప్రిక్వార్టర్స్‌లోకి

ఫిఫా ప్రపంచకప్‌ నాకౌట్‌ దశలో ఫ్రాన్స్‌, మెక్సికో, ఇంగ్లాండ్‌ జట్లు ప్రిక్వార్టర్‌ఫైనల్స్‌కు దూసుకెళ్లాయి. స్టార్‌ ఫార్వర్డ్‌ ఎంబాపె మరోసారి తన దూకుడుతో ఫ్రాన్స్‌కు విజయాన్ని అందించగా, మెక్సికో 40 ఏళ్ల నాకౌట్‌ కరవును ముగించింది. ఇంగ్లాండ్‌కు కెప్టెన్‌ హారీ కేన్‌ చివరి నిమిషాల్లో రక్షకుడిగా నిలిచాడు.

2018లో ప్రపంచకప్‌ కప్పు గెలిచిన ఫ్రాన్స్‌.. గత టోర్నీలో ఫైనల్‌ చేరిన జోరును కొనసాగిస్తూ ఈసారి కూడా బలంగా ముందుకు సాగుతోంది. నాకౌట్‌ (32 జట్ల రౌండ్‌) మ్యాచ్‌లో స్వీడన్‌పై 3-0 తేడాతో విజయం సాధించి ప్రిక్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుంది. ఫ్రాన్స్‌ తరఫున ఎంబాపె రెండు గోల్స్‌ నమోదు చేయగా, బ్రాడ్లీ బార్కోలా ఒక గోల్‌ సాధించాడు.

ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన ఫ్రాన్స్‌ 21వ నిమిషంలోనే ఆధిక్యంలోకి వెళ్లే అవకాశం కోల్పోయింది. ఒలీసే నుంచి వచ్చిన పాస్‌ను ఎంబాపె నెట్లోకి పంపినా.. ఆ ప్రయత్నాన్ని ఆఫ్‌సైడ్‌గా తేల్చిన రిఫరీ గోల్‌ను రద్దు చేశాడు. 32వ నిమిషంలో ఎంబాపె మరోసారి ప్రయత్నించిన షాట్‌ గోల్‌ పోస్ట్‌ను తాకి తిరిగివచ్చింది. అయితే తొలి అర్ధభాగం చివర్లో 45వ నిమిషంలో ఎంబాపె గోల్‌తో ఫ్రాన్స్‌ ఆధిక్యంలోకి వెళ్లింది.

విరామం తర్వాత కూడా ఫ్రాన్స్‌ దూకుడును కొనసాగించింది. రెండో అర్ధభాగం ప్రారంభమైన కొద్దిసేపటికే 53వ నిమిషంలో బార్కోలా గోల్‌తో స్కోరు 2-0గా మారింది. ఒలీసే నుంచి వచ్చిన పాస్‌ను అతడు నెట్లోకి పంపాడు. 74వ నిమిషంలో ఎంబాపె మరో గోల్‌ చేసి ఆధిక్యాన్ని 3-0కు పెంచాడు.

ఈ టోర్నీలో ఎంబాపె ఇప్పటివరకు ఆరు గోల్స్‌ చేసి గోల్డెన్‌ బూట్‌ రేసులో అర్జెంటీనా స్టార్‌ మెస్సితో సమంగా ఉన్నాడు. మొత్తం ప్రపంచకప్‌ మ్యాచ్‌లలో అతడి గోల్స్‌ సంఖ్య 18కు చేరింది. మెస్సి 19 గోల్స్‌తో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

ఇదిలా ఉంటే, మెక్సికో జట్టు 40 ఏళ్ల నాకౌట్‌ కరవును ముగించింది. బుధవారం ఈక్వెడార్‌పై 2-0 తేడాతో గెలిచి ప్రిక్వార్టర్‌ఫైనల్‌ (16 జట్ల రౌండ్‌)కు చేరుకుంది. మెక్సికో తరఫున జులియన్‌ క్వినోస్‌, రౌల్‌ జిమినెజ్‌ చెరో గోల్‌ చేశారు. మ్యాచ్‌లో ఎక్కువసేపు బంతి నియంత్రణ ఈక్వెడార్‌దే అయినా.. మెక్సికో దాడులు మాత్రం ప్రమాదకరంగా సాగాయి. 22వ నిమిషంలో క్వినోస్‌ బలమైన స్ట్రైక్‌తో స్కోరును ప్రారంభించగా, 31వ నిమిషంలో జిమినెజ్‌ గోల్‌తో మెక్సికో ఆధిక్యాన్ని 2-0కు పెంచుకుంది.

అట్లాంటాలో జరిగిన మరో నాకౌట్‌ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ 2-1 తేడాతో డ్ర్ కాంగో పై గెలిచి ప్రిక్వార్టర్స్‌కు చేరుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన DR Congo ఏడో నిమిషంలోనే సిపెంగా గోల్‌తో ఆధిక్యంలోకి వెళ్లి ఇంగ్లాండ్‌కు షాక్‌ ఇచ్చింది. విరామం వరకు స్కోరు సమం చేసేందుకు వచ్చిన అవకాశాలను ఇంగ్లాండ్‌ వృథా చేసుకుంది.

ద్వితీయార్ధంలో ఇంగ్లాండ్‌ దూకుడు పెంచినా 74వ నిమిషం వరకు వెనుకబడే ఉండడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అయితే 75వ నిమిషంలో హారీ కేన్‌ గోల్‌తో ఇంగ్లాండ్‌ సమం చేసింది. గోర్డాన్‌ నుంచి వచ్చిన క్రాస్‌ను కేన్‌ తలతో నెట్లోకి పంపాడు. జోరు కొనసాగించిన కేన్‌ 86వ నిమిషంలో బాక్స్‌ అంచులో బంతిని అందుకుని బలమైన షాట్‌తో గెలుపు గోల్‌ నమోదు చేశాడు. రెండు గోల్స్‌లోనూ గోర్డాన్‌ అసిస్టులు కీలకంగా నిలిచాయి.

ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో తదుపరి నాకౌట్‌ మ్యాచ్‌లలో స్పెయిన్‌ – ఆస్ట్రియా జట్లు అర్ధరాత్రి 12.30 గంటలకు తలపడగా, పోర్చుగల్‌ – క్రొయేషియా జట్ల పోరు శుక్రవారం తెల్లవారుజామున 4.30 గంటలకు జరగనుంది.