రాయలసీమ న్యూస్, స్పోర్ట్స్ డెస్క్: అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో ఓ గొప్ప అధ్యాయం ముగిసింది. ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సి అర్జెంటీనా తరఫున ఇకపై ఆడబోనని ప్రకటించాడు. శనివారం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అంతర్జాతీయ ఫుట్‌బాల్ నుంచి రిటైరవుతున్నట్టు వెల్లడించాడు. దీంతో మెస్సిని ప్రపంచకప్‌లో మళ్లీ చూడలేమన్న నిర్ధారణకు అభిమానులు చేరుకున్నారు.
“ఈ నిర్ణయం ఎంతో బాధిస్తుంది. కానీ రిటైర్ కావాల్సిన సమయం వచ్చేసింది. నేను ఎప్పుడు బరిలోకి దిగినా సర్వశక్తులూ ఒడ్డా. ఈ జెర్సీ కోసం మైదానంలో ఎంతో పోరాడా. మీకు ఆనందాన్నివ్వడం, అర్జెంటీనా పౌరులుగా మీరు గర్వపడేలా చేయడం కోసమే ఇదంతా”
అని 39 ఏళ్ల మెస్సి తన సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నాడు. జూన్ 21ననే రిటైర్మెంట్ లేఖ రాసినట్టు, అయితే తన తండ్రి అనారోగ్యం కారణంగా దాన్ని అప్పట్లో పోస్ట్ చేయలేకపోయానని మెస్సి తెలిపాడు. మెస్సి తండ్రి జోర్జ్ ఆగస్టు 8న కన్నుమూశారు.
మెస్సి 2006లో అర్జెంటీనా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో (ఫుట్‌బాల్‌లో) అరంగేట్రం చేశాడు. 2022లో అర్జెంటీనా జట్టుకు ప్రపంచకప్‌ను అందించాడు. రెండు దశాబ్దాల పాటు తనకు అండగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ మెస్సి, వారి ప్రేమ, మద్దతు వల్లే ఈ స్థాయికి చేరానని తన పోస్ట్‌లో పేర్కొన్నాడు.
తన రెండు దశాబ్దాల అంతర్జాతీయ కెరీర్‌లో మెస్సి మొత్తం 207 మ్యాచ్‌లు ఆడాడు. 125 గోల్స్ నమోదు చేశాడు. 2006లో క్రొయేషియాపై మ్యాచ్‌లో తన తొలి గోల్ సాధించాడు. 2026 ప్రపంచకప్‌లో ఈజిప్ట్‌పై చేసిన గోల్ అతడి చివరి అంతర్జాతీయ గోల్‌గా నిలిచింది.
అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాళ్ల జాబితాలో మెస్సి రెండో స్థానంలో ఉన్నాడు. 233 మ్యాచ్‌ల్లో 146 గోల్స్ చేసిన రొనాల్డో తర్వాత మెస్సి 207 మ్యాచ్‌ల్లో 125 గోల్స్‌తో రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. అర్జెంటీనా తరఫున ఇక ఆడకపోయినా, క్లబ్ ఫుట్‌బాల్‌లో మాత్రం కొనసాగనున్నాడు. ప్రస్తుతం మెస్సి మేజర్ లీగ్ సాకర్ క్లబ్ ఇంటర్ మయామి కెప్టెన్‌గా ఉన్నాడు.
ఇటీవల ముగిసిన ప్రపంచకప్‌లో మెస్సి ఎనిమిది మ్యాచ్‌ల్లో ఆరు గోల్స్ చేశాడు. రికార్డు స్థాయిలో ఆరు ప్రపంచకప్‌లు ఆడిన అతడు, 2022లో అర్జెంటీనా ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ప్రపంచకప్‌లలో మొత్తం 21 గోల్స్ నమోదు చేసి తన మాంత్రిక ప్రతిభను మరోసారి చాటాడు.
మెస్సి గతంలో కూడా ఒకసారి అంతర్జాతీయ ఫుట్‌బాల్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. 2016 కోపా అమెరికా ఫైనల్ తర్వాత రిటైర్‌మెంట్ ప్రకటించిన అతడు, కొద్ది కాలానికే తిరిగి జట్టులోకి వచ్చాడు. ఈసారి మాత్రం అర్జెంటీనా జెర్సీకి శాశ్వతంగా గుడ్‌బై చెప్పినట్టు స్పష్టం చేశాడు.






