భారత వెయిట్‌లిఫ్టింగ్‌లో ఇప్పటికే దిగ్గజ హోదా సంపాదించిన మీరాబాయి చాను, ఆసియా క్రీడలలోనూ తన పేరును చెక్కించుకుంది. అయిచి-నగోయా ఆసియా క్రీడల్లో రజత పతకం సాధించడం ద్వారా తన కెరీర్‌లో చాలా కాలంగా మిగిలిపోయిన లోటును పూడ్చుకుంది. ఈ విజయంతో తనపై ఉన్న మానసిక భారం దిగిపోయిందని ఆమె భావిస్తోంది.

ప్రపంచ వేదికలపై మెరవడం మీరాబాయి చానుకు కొత్తేమీ కాదు. ఒలింపిక్స్‌లో ప్రతిభ చాటిన ఆమె, ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లోనూ పతకాల వర్షం కురిపించింది. అయినా ఆసియా క్రీడలలో మాత్రం ఇప్పటివరకు పతకం దక్కకపోవడం ఆమెకు పెద్ద బాధగా మిగిలింది. ఈసారి ఆ నిరీక్షణకు ముగింపు పలికింది.

కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను ఇప్పటివరకు మూడు స్వర్ణ పతకాలు (2018, 2022, 2026) గెలుచుకుంది. అంతకుముందు 2014లో ఒక రజత పతకం కూడా సాధించింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో ఒక స్వర్ణం (2017), రెండు రజతాలు (2022, 2025) ఆమె ఖాతాలో ఉన్నాయి. క్రమశిక్షణ, కఠిన సాధనతో ఎప్పుడూ స్థిరమైన ప్రదర్శననే కనబరుస్తూ వచ్చింది.

టోక్యో ఒలింపిక్స్‌ (2020)లో రజత పతకం గెలిచి తన ఒలింపిక్ కలను నెరవేర్చుకున్న చాను, ఆసియా క్రీడల పతకం మాత్రం అందుకోలేకపోయింది. 2014లో తన తొలి ఏషియాడ్‌లో నిరాశాజనక ప్రదర్శనతో తొమ్మిదో స్థానంలో నిలిచింది. 2018 క్రీడలకు గాయం కారణంగా దూరమైంది. 2023 ఏషియాడ్‌లో తొడ గాయం వేధిస్తున్నా పట్టుదలతో పోటీ పడి, త్రుటిలో పతకం కోల్పోయి నాలుగో స్థానంలో నిలవాల్సి వచ్చింది. ఆ వైఫల్యం ఆమెను తీవ్రంగా కలచివేసింది.

అయితే అయిచి-నగోయా క్రీడల్లో చాను పట్టువదలకుండా పోరాడింది. 12 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించి రజత పతకం సాధించింది. ఈ విజయంతో తన కల నెరవేరిందని, భారం దిగిపోయిందని ఆమె పేర్కొంది.

ఆసియా క్రీడల్లో పతకం గెలవడం నా కల. నా జీవితం ఇప్పుడు పరిపూర్ణమైంది. ఎలాగైనా పతకం గెలవాలనే పట్టుదలతో జపాన్‌కు వచ్చా. నేను 110 (క్లీన్ అండ్ జెర్క్‌లో) కిలోల కన్నా ఎక్కువ ఎత్తాలనుకున్నా. స్వర్ణం కష్టమని తెలుసు. కానీ అత్యుత్తమ ప్రదర్శన చేయాలనుకున్నా. తక్కువ ఎత్తి పతకం నెగ్గాలనుకోలేదు

ఆసియా స్థాయిలోనే అయినా చాను సాధించిన ఈ విజయాన్ని తక్కువ చేసి చూడలేమని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే ప్రపంచంలోని అగ్రశ్రేణి వెయిట్‌లిఫ్టర్లు ఎక్కువగా ఆసియా ఖండానికే చెందినవారు. ఒలింపిక్స్‌లో కూడా ప్రధాన పోటీ వీళ్ల మధ్యే ఉంటుంది.

ముఖ్యంగా చాను బరువు విభాగం 49 కిలోలలో ఉత్తర కొరియా, చైనా, ఇండోనేసియా, చైనీస్ తైపీ క్రీడాకారిణుల నుంచి తీవ్రమైన పోటీ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ పతకం గెలవడం అంటే దాదాపు ఒలింపిక్స్‌లో పతకం గెలిచినంత కష్టమైన పని అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇక 2028 ఒలింపిక్స్‌ను లక్ష్యంగా పెట్టుకున్న 32 ఏళ్ల మీరాబాయి చాను ముందుకు పెద్ద సవాలు నిలిచింది. ఆ క్రీడల్లో 49 కిలోల విభాగం లేకపోవడంతో ఆమె 53 కిలోల విభాగానికి మారాల్సి ఉంటుంది. కొత్త బరువు విభాగానికి అలవాటు పడటం, అదే స్థాయిలో పోటీ ఇవ్వడం కోసం చాను మరింత కఠిన సాధన చేయాల్సి ఉండనుంది.