రాయలసీమ న్యూస్, స్పోర్ట్స్ డెస్క్: దిల్లీ: భారత జావెలిన్ తార నీరజ్ చోప్రా డైమండ్ లీగ్ ఫైనల్‌కు అర్హత సాధించాడు. మొత్తం 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచిన ఆయన, సెప్టెంబరు 5న బ్రసెల్స్‌లో జరగనున్న ఈ ప్రతిష్ఠాత్మక పోటీలో బరిలో దిగనున్నాడు. గురువారం జ్యూరిచ్‌లో ముగిసిన ఈ సీజన్ చివరి (14వ) అంచెతో ఫైనల్ రేసు పూర్తయింది.
డైమండ్ లీగ్ పాయింట్ల పట్టికలో తొలి ఆరు స్థానాల్లో నిలిచిన అథ్లెట్లు ఫైనల్‌కు అర్హులు అవుతారు. 39 పాయింట్లతో శ్రీలంక సంచలనం రుమేశ్ పతిరగె అగ్రస్థానంలో నిలిచాడు. అండర్సన్ పీటర్స్ (35, గ్రెనడా), ప్రపంచ ఛాంపియన్ కేషార్న్ వాల్కాట్ (23, ట్రినిడాడ్ అండ్ టోబాగో), కుర్టిస్ థాంప్సన్ (20, అమెరికా), జులియస్ ఏగో (13, కెన్యా) వరుసగా రెండో నుంచి ఐదో స్థానాల్లో నిలిచారు. వీరితో పాటు ఆరో స్థానంలో ఉన్న నీరజ్ ఫైనల్‌లో పోటీపడనున్నాడు.
ఈ సీజన్‌లో మొత్తం 14 డైమండ్ లీగ్ ఈవెంట్లు నిర్వహించగా, అందులో ఐదు అంచెల్లో మాత్రమే జావెలిన్ త్రో పోటీలు జరిగాయి. వాటిలో కేవలం రెండు అంచెల్లోనే (దోహా, లాసెన్) పాల్గొన్న నీరజ్ రెండుసార్లూ రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. అయినప్పటికీ ఆ రెండు ప్రదర్శనలతోనే ఫైనల్ టికెట్ దక్కించుకోవడం విశేషంగా మారింది.
అద్భుత ఫామ్‌లో ఉన్న శ్రీలంక త్రోయర్ రుమేశ్ తరంగ పతిరగె చివరి అంచెలోనూ తన దూకుడు కొనసాగించాడు. 10 మంది త్రోయర్లు పాల్గొన్న ఈ పోటీలో 92.07 మీటర్ల దూరం వరకు ఈటెను విసిరి మొదటి స్థానాన్ని సొంతం చేసుకున్నాడు.
ఇదిలా ఉండగా, తొలిసారి జరగనున్న ప్రపంచ అథ్లెటిక్స్ అల్టిమేట్ ఛాంపియన్‌షిప్స్‌కు కూడా నీరజ్ అర్హత సాధించే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని అథ్లెటిక్స్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ టోర్నీలో మొత్తం ఎనిమిది మంది త్రోయర్లు పోటీపడనున్నారు. 2024 ఒలింపిక్స్ ఛాంపియన్‌గా అర్షద్ నదీమ్, ప్రపంచ ఛాంపియన్ హోదాలో కేషార్న్ వాల్కాట్ ఇప్పటికే నేరుగా అర్హత పొందారు. డైమండ్ లీగ్ విజేత కూడా ఆటోమేటిక్‌గా ఈ టోర్నీకి ఎంపికవుతాడు.
మిగతా ఐదుగురు పోటీదారులను గత సంవత్సరం సెప్టెంబరు 2 నుంచి ఈ సెప్టెంబరు 1 వరకు ఉన్న ప్రపంచ అథ్లెటిక్స్ ర్యాంకింగ్స్ ఆధారంగా ఎంపిక చేయనున్నారు. తాజా ర్యాంకింగ్స్‌లో నీరజ్ ఏడో స్థానంలో ఉండగా, భారత్‌కే చెందిన సచిన్ యాదవ్ ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. సెప్టెంబరు 11 నుంచి 13 వరకు జరగనున్న ఈ అల్టిమేట్ ఛాంపియన్‌షిప్స్‌కు బుడాపెస్ట్ ఆతిథ్యమివ్వనుంది.







