రాయలసీమ న్యూస్, స్పోర్ట్స్ డెస్క్: ప్రపంచ నంబర్‌వన్ ఆన్ సియంగ్ ముందు సింధు మళ్లీ మోకరిల్లింది: పది మ్యాచ్‌లు.. ఒక్క విజయం లేదు
భారత స్టార్ షట్లర్ పి.వి. సింధు మరోసారి నిరాశపరిచింది. ఇండోనేసియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో మహిళల సింగిల్స్ విభాగంలో ఆమె ప్రస్థానం ప్రిక్వార్టర్ ఫైనల్ దశలోనే ముగిసింది. ప్రపంచ నంబర్‌వన్ ప్లేయర్ ఆన్ సియంగ్ (దక్షిణ కొరియా) చేతిలో సింధు ఓటమి పాలైంది.
గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సింధు 17-21, 14-21తో ఆన్ సియంగ్ ఎదుట పరాజయం చవిచూసింది. తొలి గేమ్‌లో ఒక దశలో స్కోరు 10-10తో సమంగా ఉండగా, ఆ తర్వాత ఆన్ సియంగ్ తనదైన శైలిలో చెలరేగి వరుస పాయింట్లు సాధించింది. దాంతో సింధును వెనక్కు నెట్టుతూ మొదటి గేమ్‌ను 21-17తో కైవసం చేసుకుంది.
రెండో గేమ్‌లోనూ ఆన్ సియంగ్ ఆధిపత్యం కొనసాగింది. ప్రారంభం నుంచే దూకుడుగా ఆడి 13-6 ఆధిక్యంలో నిలిచింది. సింధు తిరిగి పుంజుకునే అవకాశమే ఇవ్వకుండా అదే ఊపులో పాయింట్లు సమకూర్చుకుంటూ రెండో గేమ్‌ను 21-14తో గెలుచుకుంది. దీంతో మ్యాచ్‌ను గేమ్‌లలో ముగించి క్వార్టర్ ఫైనల్లోకి ఆన్ సియంగ్ దూసుకెళ్లింది.
గత వారం సింగపూర్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో కూడా సింధు, ఆన్ సియంగ్ పోటీపడగా, అప్పుడు కూడా భారత షట్లర్ ఓటమి పాలైంది. ఇప్పటివరకు ఈ ఇద్దరి మధ్య జరిగిన పది మ్యాచ్‌ల్లో ఒక్కదాంట్లో కూడా సింధు విజయం సాధించకపోవడం గమనార్హం. ప్రతి సారి ఆన్ సియంగ్‌నే పైచేయి సాధిస్తోంది.
ఇక పురుషుల డబుల్స్‌లో మాత్రం భారత జోడీ హరిహరన్ హంసకరుణన్, ఎం.ఆర్. అర్జున్ ముందుకెళ్లింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో వీరు కాంగ్ కాయ్, ఆరోన్ తాయ్ (మలేసియా) జంటను 16-21, 21-15, 21-19తో మట్టికరిపించారు. తొలి గేమ్‌ను కోల్పోయిన హరిహరన్–అర్జున్ రెండో గేమ్‌లో తిరిగి బలంగా పుంజుకుని మ్యాచ్‌ను డిసైడింగ్ గేమ్‌కి తీసుకెళ్లారు. కీలక మూడో గేమ్‌లో ఉత్కంఠభరితంగా సాగిన పోరులో చివరికి భారత జోడీనే విజేతగా నిలిచింది.
పురుషుల సింగిల్స్‌లో యువ ఆటగాడు ఆయుష్ శెట్టి పోరాటం ముగిసింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో అతడు లీ చెక్ యు చేతిలో 21-16, 13-21, 14-21తో ఓటమి చవిచూశాడు. తొలి గేమ్‌ను గెలిచిన ఆయుష్ తర్వాతి రెండు గేమ్‌లలో ఆధిపత్యాన్ని కోల్పోయాడు.
మిక్స్‌డ్ డబుల్స్‌లో రోహన్ కపూర్, రుత్విక గద్దె ద్వయం టోర్నీ నుంచి నిష్క్రమించింది. గికెల్, డెల్‌ర్యూ (ఫ్రాన్స్) జోడీతో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో భారత జంట 13-21, 12-21తో పరాజయం పాలైంది. దీంతో ఇండోనేసియా ఓపెన్‌లో భారత సవాలు కొన్ని విభాగాల్లో నిలిచిపోయి, కొన్నింటిలో మాత్రమే కొనసాగుతోంది.







