రాయలసీమ న్యూస్, స్పోర్ట్స్ డెస్క్:
బ్రెజిల్ స్టార్ ఫుట్‌బాలర్ నెయ్‌మర్ ఆటకు వీడ్కోలు పలికాడు. దీంతో ఇప్పుడందరి దృష్టి మిగతా దిగ్గజ ఫుట్‌బాల్ ప్లేయర్లపై పడింది. మరీ ముఖ్యంగా 41 ఏళ్ల పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడోనని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. సోమవారం అర్ధరాత్రి స్పెయిన్‌తో పోర్చుగల్ ప్రిక్వార్టర్స్‌లో తలపడనుంది. ఈ క్రమంలో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన రొనాల్డో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఈ మ్యాచ్ ఆఖరిది కాకూడదు..
‘‘ఆటను ఎంత వరకు ఆస్వాదించామనేదే ముఖ్యం. ఇదే నా చివరి వరల్డ్ కప్ (FIFA World Cup 2026). అయితే, స్పెయిన్‌తో మ్యాచ్ చివరిది కాకూడదని అనుకుంటున్నా. ఏదో ఒక రోజు ఆటకు వీడ్కోలు పలకాల్సిన సమయం వస్తుంది. అందులో నేను నిజాయతీగా ఉంటా. రేపు ఏం జరిగినా.. ప్రశాంతంగా అక్కడి నుంచి నిష్క్రమిస్తా. అది 100 శాతం కాదు.. 1000శాతంతో మనస్ఫూర్తిగా చెబుతున్నా. ఫుట్‌బాల్ కోసం నాకు చేతనైనంత వరకూ చేశా. ఆటపట్ల ప్యాషన్‌తోనే కొనసాగుతున్నా. ప్రతి రోజునూ ఆస్వాదిస్తున్నా’’ అని రొనాల్డో వెల్లడించాడు. 2030 వరల్డ్ కప్ ఆతిథ్య హక్కులు పోర్చుగల్, స్పెయిన్, మొరాకో దక్కించుకున్నాయి.
‘ఇప్పటి వరకు ఈ వరల్డ్ కప్‌లో మూడు గోల్స్ చేశా. అదేమంత చెత్త ప్రదర్శనైతే కాదు. ఈ వరల్డ్ కప్‌లో ఆడటం చాలా బాగుంది. గతంతో పోలిస్తే ఈసారి అభిమానుల్లోనూ భావోద్వేగాలు ఎక్కువగా ఉన్నాయి. నా జీవితంలో ఏదీ కొరతలేదు. అన్నింటినీ సాధించా. వరల్డ్ కప్ కూడా గెలిచా. ఈసారి కూడా కప్‌తో టోర్నీని ముగించేందుకు ప్రయత్నిస్తాం. వయసు అనేది మనకు పరిణతితోపాటు అనుభవం ఇస్తుంది. 41 ఏళ్లు వచ్చినా సరే నా ఆటతీరుపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఈ సందర్భంగా వారందరికీ నేను థాంక్స్ చెబుతున్నా. మరో నలభై ఏళ్లైనా సరే ఇలాంటివాటితో నేను బతికేస్తా. విమర్శలతో వ్యక్తిగా మరింత మెరుగయ్యా’’ అని రొనాల్డో తెలిపాడు.
ఆ కుర్రాడికి మంచి భవిష్యత్తు ఉంది..
‘‘లామినె యమాల్‌కు మంచి భవిష్యత్తు ఉంది. నా దృష్టిలో.. స్పెయిన్‌ను ఓ సమష్టి జట్టుగానే చూస్తా. చాలా మంచి ఆటగాళ్లు ఉన్నారు. ఎక్కువ కాలం కెరీర్‌ను కొనసాగించాలంటే మాత్రం మెరుగైన సన్నద్ధత అవసరం. విమర్శలను పట్టించుకుంటే మాత్రం అక్కడితో ఆగిపోతారు. నిర్మాణాత్మకమైన అభిప్రాయాలతో పాటు.. మిమ్మల్ని దెబ్బతీయడమే లక్ష్యంగా చేసుకునే విమర్శలూ ఉంటాయి. సుదీర్ఘమైన కెరీర్ కావాలంటే మీరు పరిస్థితులకు అనుగుణంగా మారాలి. గత 23 ఏళ్లుగా నేను ఇలాంటివి ఎన్నో అనుభవించా’’ అని రొనాల్డో వ్యాఖ్యానించాడు.







