భారత డబుల్స్‌ స్టార్‌లు సాత్విక్‌ సాయిరాజు, చిరాగ్‌ శెట్టి మరోసారి తమ దూకుడును చాటారు. కెరీర్‌లో తొలిసారిగా చైనా మాస్టర్స్ బాడ్మింటన్ సూపర్ 750 టైటిల్‌ను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించారు. ఆదివారం జరిగిన రసవత్తర ఫైనల్లో చైనా జంటను మట్టి కరిపించి ఛాంపియన్లుగా నిలిచారు. ఈ సీజన్‌లో ఈ జోడీకి ఇది రెండో Super 750 టైటిల్‌.

షెన్జ్హేంలో గత నెల స్వదేశంలో జరిగిన వరల్డ్ బాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో నిరాశపరిచిన సాత్విక్–చిరాగ్‌ ద్వయం, చైనా మాస్టర్స్లో మాత్రం తమ అసలైన స్థాయికి తగ్గ ఆటతీరుతో టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఈ జంట 11–21, 21–13, 21–17తో చైనాకు చెందిన ప్రపంచ మాజీ నాలుగో ర్యాంక్‌ జంట He Ji Ting, Ren Xiang Yuపై విజయం సాధించింది.

చైనా మాస్టర్స్ టోర్నీలో సాత్విక్–చిరాగ్‌ జంట 2023, 2025 సంవత్సరాల్లో రన్నరప్‌గా నిలిచింది. ఈసారి మాత్రం ఆ అడ్డంకిని దాటుతూ శిఖరాన్ని అధిరోహించింది. ఈ ద్వయం ఈ ఏడాది మేలో సింగపూర్ ఓపెన్ సూపర్ 750 టైటిల్‌ను కూడా గెలుచుకుంది. ఆసియన్ గేమ్స్ లో స్వర్ణాన్ని కాపాడుకోవాలనే లక్ష్యంతో ఉన్న ఈ భారత జంటకు చైనా మాస్టర్స్ విజయం మరింత ఉత్సాహాన్ని నింపిందని క్రీడా వర్గాలు భావిస్తున్నాయి.

ఫైనల్‌ తొలి గేమ్‌లో సాత్విక్–చిరాగ్‌ జంట తడబాటుగా ఆరంభించింది. గతంలో ఈ చైనా జంటపై రెండు సార్లు గెలిచిన భారత ద్వయం, ఈసారి మొదట్లో ర్యాలీలపై నియంత్రణ సాధించలేకపోయింది. హిజి టింగ్ రెం క్సియాంగ్ యు ఎటాకింగ్‌ గేమ్‌తో 5–0 ఆధిక్యంలోకి దూసుకెళ్లారు. కట్టుదిట్టమైన సర్వీస్‌, శక్తివంతమైన స్మాష్‌లతో చైనా జోడీ 8–3, అనంతరం 14–7, 17–9 ఆధిక్యాలను సాధించి తొలి గేమ్‌ను అలవోకగా 21–11తో గెలుచుకుంది.

రెండో గేమ్‌లో మాత్రం సాత్విక్–చిరాగ్‌ ద్వయం అద్భుతంగా పుంజుకుంది. డిఫెన్స్‌ను బలోపేతం చేస్తూ ర్యాలీలను పొడిగించింది. సాత్విక్‌ చక్కటి సర్వీస్‌లతో రిథమ్‌ అందుకోగా, చిరాగ్‌ దూకుడు స్మాష్‌లతో చైనా జంటను ఇబ్బంది పెట్టాడు. వరుసగా ఐదు పాయింట్లు సాధించిన భారత జంట 9–6 ఆధిక్యంలో నిలిచింది. విరామానికి నాలుగు పాయింట్ల ఆధిక్యాన్ని సాధించింది. ఈ గేమ్‌లో 45 షాట్లపాటు సాగిన దీర్ఘ ర్యాలీలో పైచేయి సాధించిన సాత్విక్–చిరాగ్‌ 12–8, అనంతరం 17–11తో ముందంజలో నిలిచి, చివరకు 21–13తో గేమ్‌ను గెలిచి మ్యాచ్‌ను నిర్ణయాత్మక మూడో గేమ్‌కు తీసుకెళ్లింది.

డిసైడర్‌ గేమ్‌ ఆరంభంలో చైనా జంట బలంగా పుంజుకుని 4–0, తరువాత 7–3 ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే సాత్విక్–చిరాగ్‌ క్రమంగా జోరందుకుని స్కోరును 7–7తో సమం చేశారు. విరామానికి చైనా జంట రెండు పాయింట్ల ఆధిక్యంలో (11–9) నిలిచింది. విరామం తర్వాత రెండు జంటలు హోరాహోరీ ర్యాలీలు ఆడగా, He–Ren జంట 15–12 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

ఈ దశలో మళ్లీ గేర్‌ మార్చిన సాత్విక్–చిరాగ్‌ 16–16తో స్కోరును సమం చేశారు. చైనా జంట 17–16తో మరోసారి ఆధిక్యంలోకి వచ్చినా, అక్కడి నుంచి భారత ద్వయం వరుసగా ఐదు పాయింట్లు సాధించి 21–17తో గేమ్‌, మ్యాచ్‌, టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకుంది. ఈ విజయం ద్వారా ప్రపంచ బ్యాడ్మింటన్‌లో సాత్విక్–చిరాగ్‌ జంట ఆధిపత్యాన్ని మరోసారి చాటింది.