రాయలసీమ న్యూస్, శ్రీ సత్యసాయి: శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం లో రానున్న వినాయక చవితి, నవరాత్రి సందర్భంగా పట్టణంలో నిర్వహించబోయే గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా నిర్వహించాలని జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖలు స్పష్టం చేశాయి. గుడ్డం కళ్యాణ మండపంలో బుధవారం నిర్వహించిన ఉత్సవ కమిటీల సమన్వయ సమావేశంలో అదనపు ఎస్పీ అంకిత సురానా, జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, అదనపు ఎస్పీ కే.వి.మహేష్ పాల్గొని ఉత్సవాల నిర్వహణపై పలు కీలక సూచనలు చేశారు.
గణేష్ మండపాల ఏర్పాటుకు సంబంధిత ప్రభుత్వ శాఖల నుండి నిర్వాహకులు తప్పనిసరిగా ముందస్తు అనుమతులు పొందాలని అధికారులు స్పష్టం చేశారు. విగ్రహ ప్రతిష్ఠాపన, నిత్య పూజలు, నిమజ్జన కార్యక్రమాలను అధికారులు నిర్దేశించిన సమయాల్లోనే పూర్తి చేయాలని సూచించారు. శబ్ద కాలుష్య నియంత్రణకు ప్రాధాన్యత ఇస్తూ ఉత్సవాల్లో DJ Systems వినియోగంపై నిషేధం అమల్లో ఉంటుందని, అధిక శబ్దాలు లేని స్పీకర్లను మాత్రమే నిబంధనల ప్రకారం ఉపయోగించాలన్నారు. అనుమతి లేని ఊరేగింపులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు.
భద్రత, మౌలిక వసతుల పరంగా కూడా నిర్వాహకులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ప్రధాన రహదారులు, ఎమర్జెన్సీ రూట్ ఆక్రమించకుండా, రాకపోకలకు అంతరాయం కలగకుండా మండపాలు నిర్మించాలన్నారు. విద్యుత్ కనెక్షన్ల విషయంలో తగిన భద్రతా ప్రమాణాలు పాటించి, షార్ట్ సర్క్యూట్లు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి మండపం వద్ద తగినన్ని అగ్నిమాపక పరికరాలు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. పారిశుధ్యానికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ మండపాల పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని స్పష్టం చేశారు.
సోషల్ మీడియా వినియోగంపై కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మత సామరస్యానికి భంగం కలిగించేలా ప్రవర్తించినా, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు, పుకార్లు, రెచ్చగొట్టే పోస్టులు పెట్టినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఊరేగింపులు, నిమజ్జన సమయాల్లో మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధుల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఏదైనా అనుమానాస్పద వస్తువులు లేదా వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా 100, 112 నంబర్లకు సమాచారం అందించాలని ప్రజలను అప్రమత్తం చేశారు.
ఉత్సవాలు, ఊరేగింపుల సమయంలో మద్యం సేవించడం, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడటం పూర్తిగా నిషేధించబడిందని అధికారులు పేర్కొన్నారు. పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్, అగ్నిమాపక, వైద్య, రవాణా శాఖల అధికారులు ఉత్సవ కమిటీలతో నిరంతరం సమన్వయం పాటిస్తూ పర్యవేక్షిస్తారని జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా రవాణా అధికారి కరుణాసాగర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున, సీఐలు, ఎస్ఐలు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, గణేష్ ఉత్సవ సమితి సభ్యులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఉత్సవాల విజయవంతమైన నిర్వహణకు అధికారులు, నిర్వాహకులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో నిర్ణయించారు.













