విత్తన వరి సాగుతో లాభాలు..

కొత్త పద్ధతి తో రైతులకు ఆర్థిక భరోసా

విత్తన వరి సాగు రైతుల ఇంట సిరులు కురిపిస్తోంది. సాధారణ వరి సాగుతో నష్టాలు, తక్కువ లాభాలు చూసిన అన్నదాతలు ఇప్పుడు విత్తన వరి సేద్యాన్ని లాభసాటిగా మార్చుకొని పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటిస్తూ నాణ్యమైన విత్తన ఉత్పత్తిని సాధిస్తూ ఆదాయాన్ని పెంచుకుంటున్నారు.

కణేకల్లు మండలంలోని పలు ప్రాంతాలకు చెందిన సుమారు 200 మంది రైతులు బాపట్ల జిల్లా జంగమేశ్వరపురం ప్రభుత్వ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి ‘బీపీటీ సోనా 5204’ రకానికి చెందిన మూల విత్తనాన్ని కొనుగోలు చేస్తున్నారు. కిలోకు రూ.60 చొప్పున ఈ విత్తనాన్ని సేకరించి తమ పొలాల్లో సాగు చేస్తున్నారు. రైతులు ఎకరాకు 25 నుంచి 30 కిలోల వరకు విత్తనాలు చల్లి సాధారణ పద్ధతిలోనే నారు వేస్తున్నారు. నారు వేయించిన అనంతరం 30 నుంచి 35 రోజుల మధ్యలో నారు తొలగించి నాట్లు వేయడం ద్వారా సాగును కొనసాగిస్తున్నారు. ఈ ప్రక్రియలో సేంద్రియ ఎరువులకు ప్రాధాన్యం ఇస్తూ, అవసరమైన మేరకే రసాయన ఎరువులను వినియోగిస్తున్నారు.

కొత్త పద్ధతి తో రైతులకు ఆర్థిక భరోసా

విత్తన వరి సాగులో నాణ్యతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వడం వల్ల కోతల అనంతరం వడ్లను జాగ్రత్తగా ఆరబెట్టడం, తాలు, ఇతర వ్యర్థాలను పూర్తిగా తొలగించడం వంటి చర్యలను రైతులు పాటిస్తున్నారు. ఈ విధంగా శుభ్రపరిచిన విత్తన వరిని 75 కిలోల సంచులుగా ప్యాక్ చేసి ప్రతి సంచిని రూ.2500 చొప్పున విక్రయిస్తున్నారు. ఒక ఎకరాలో 40 నుంచి 45 బస్తాల వరకు నాణ్యమైన దిగుబడులు రావడంతో రైతులు మంచి ఆదాయం పొందుతున్నారు. సాధారణ వరి ధాన్యంతో పోలిస్తే విత్తన వరికి మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉండటంతో రైతులు ఈ పద్ధతిని మరింత విస్తరించేందుకు ఆసక్తి చూపుతున్నారు. వ్యవసాయ శాఖ పర్యవేక్షణలో సాగు చేస్తున్న ఈ విత్తన వరి పంట రైతులకు ఆర్థికంగా తోడ్పడటంతో పాటు, ప్రాంతంలో నాణ్యమైన విత్తనాల లభ్యతను కూడా పెంచుతోంది. కణేకల్లు మండలంలో ప్రారంభమైన ఈ విత్తన వరి సాగు పద్ధతి ఇతర మండలాల రైతులకు కూడా ప్రేరణగా మారుతోంది.