శ్రీఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం కోనేరు అభివృద్ధి పనుల్లో కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని భాజపా నాయకుడు విష్ణువర్ధన్‌రెడ్డి ఆరోపించారు. కదిరిలోని కోనేరు పనులను కూటమి నాయకులతో కలిసి పరిశీలించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు.

కోట్లాది భక్తుల ఆరాధ్య దైవం ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ కోనేరులోకి డ్రైనేజీ ఊట నీరు చేరి కలుషితం కాకుండా చూడటానికి కోట్ల రూపాయల వ్యయంతో టెండర్లు పిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఆరు బ్రహ్మోత్సవాలు జరిగినా కోనేరు నిర్మాణం పూర్తికాలేదని ఆయన విమర్శించారు.

మొదటి దశలో రూ.2 కోట్ల టెండర్‌ మంజూరు చేసినప్పటికీ, గుత్తేదారు దాదాపు రూ.10 లక్షల విలువైన పనులు కూడా చేయకుండానే రూ.1.65 కోట్లు తీసుకున్నట్లు ఆరోపించారు. రెండోసారి రూ.4 కోట్ల టెండర్‌ను ఐదు శాతం అధిక మొత్తానికి కాంట్రాక్టుకు ఇచ్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ పనులను 12 నెలల్లో పూర్తి చేయాల్సి ఉండగా, ఆరు నెలలకే సప్లిమెంట్‌ టెండర్‌ మంజూరు చేయడం అనుమానాస్పదమని పేర్కొన్నారు.

ఇప్పుడీ కోనేరు ప్రహరీ నిర్మాణానికి మరోసారి రూ.40 లక్షలు కేటాయించారని, మొత్తం ప్రక్రియలో భారీ అవకతవకలు ఉన్నాయని విష్ణువర్ధన్‌రెడ్డి ఆరోపించారు. అక్రమాలకు పాల్పడిన వారిని కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ వదలదని, ఈ వ్యవహారాన్ని సీయం చంద్రబాబు, మంత్రి లోకేశ్, దేవాదాయశాఖ మంత్రి, కమిషనర్‌ల దృష్టికి తీసుకెళ్లి విజిలెన్స్‌ విచారణ కోరనున్నట్లు వివరించారు.

జనసేన బాధ్యుడు భైరవప్రసాద్‌ మాట్లాడుతూ ఆలయ భూములు, దుకాణాల ఆదాయంపై అధికారుల నిర్లక్ష్యం కొనసాగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆక్రమణల నివారణపై దృష్టి పెట్టాలని డిమాండ్‌ చేశారు. తెదేపా నాయకుడు నాగేంద్ర ప్రసాద్‌ స్వామివారి ప్రసాదం లడ్డూలో నాణ్యతను కచ్చితంగా పాటించాలని సూచించారు.

కోనేరు పనుల నిర్వహణలో దేవాదాయశాఖ ఇంజినీరు బినామీ గుత్తేదారుగా వ్యవహరించి, ఇద్దరూ కలిసి అధికారికంగా నిధులను డ్రా చేసినట్లు నాయకులు ఆరోపించారు. కోనేరు విస్తీర్ణం తగ్గించి, నాసిరకం పనులు చేయడంతో ఆ నిర్మాణాలు వరదల సమయంలో కొట్టుకుపోయాయని, ఈ క్రమంలో రూ.1.55 కోట్లు దోచుకున్నారని విమర్శించారు.

మిగిలిన రూ.35 లక్షలకే పనులు చేసినట్టు చూపించి, డబ్బులు దోచుకునే ప్రయత్నంలో పంపకాల్లో తేడా రావడంతో కొందరు రాజకీయ నాయకులు చేతివాటం ప్రదర్శించారని ఆరోపించారు. ఒప్పందాల్లో తేడాలు రావటంతో ఆలయ రికార్డులను తారుమారు చేసినట్టు పేర్కొన్నారు.

కోనేరు పనుల వివరాల కోసం కదిరికి చెందిన ఓ భక్తుడు, కొందరు న్యాయవాదులు స.హ.చట్టం కింద దరఖాస్తులు చేసినప్పటికీ, సమాచారం ఇవ్వకుండా తిరస్కరించడం విచిత్రమని నాయకులు వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో నాయకులు సోమ్లానాయక్, చలపతి, వెంకటేష్, ప్రేమనాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.