కదిరి:- విద్యార్థులకు విద్యను బోధించి, వారి భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉంటుంది. అయితే ఆ బాధ్యతను విస్మరించి, విద్యార్థినులను వ్యక్తిగత పనులకు ఉపయోగించుకున్న ఘటన శ్రీసత్యసాయి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. కదిరి నియోజకవర్గంలోని నంబుళపూలకుంటలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో పనిచేస్తున్న టీచర్ రూపా ప్రవర్తన ప్రస్తుతం తీవ్ర విమర్శలకు గురవుతోంది.

పాఠశాల వేళల్లోనే రూపా అనే ఉపాధ్యాయురాలు విద్యార్థినులతో తన ఒళ్లు మసాజ్ చేయించుకోవడం, కాళ్లు పట్టించుకోవడం వంటి వ్యక్తిగత సేవలు చేయించినట్లు సమాచారం. తరగతి గదిలోనే విద్యార్థినులతో ఈ విధంగా వ్యవహరించిన దృశ్యాలు వీడియో రూపంలో సోషల్ మీడియాలోకి చేరాయి. ఆ వీడియోలు విపరీతంగా వైరల్ కావడంతో ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ మొదలైంది.

ఉపాధ్యాయ వృత్తికి కళంకం తెచ్చేలా రూపా ప్రవర్తించారని నెటిజన్లు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థినులను సంరక్షించి, వారికి సురక్షిత వాతావరణం కల్పించాల్సిన ఉపాధ్యాయురాలే ఇలా వ్యవహరించడం అంగీకారయోగ్యం కాదని సామాజిక వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. పాఠశాలల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ కావడంతో విద్యాశాఖ అధికారులు, సంబంధిత శాఖల సిబ్బంది వెంటనే స్పందించారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. విద్యార్థినుల నుంచి, పాఠశాల సిబ్బంది నుంచి వివరాలు సేకరించి, నిజానిజాలు వెలికి తేవడానికి అధికారుల బృందం కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాన్ని సందర్శించినట్లు సమాచారం.

విచారణ పూర్తయ్యాక టీచర్ రూపాపై తగిన శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. విద్యార్థుల హక్కులను, భద్రతను ఉల్లంఘించేలా ఉపాధ్యాయులు వ్యవహరిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. ఈ ఘటనతో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో పర్యవేక్షణను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని విద్యా రంగ నిపుణులు సూచిస్తున్నారు.