పుట్టపర్తి:- శ్రీ సత్య సాయి జిల్లాలో ప్రజారవాణా పరిస్థితి రోజురోజుకు దారుణంగా మారుతోంది. బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నా, ఆ మేరకు బస్సు సర్వీసులను పెంచకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని అన్ని డిపోల పరిధిలోనూ ప్రధాన మార్గాల్లో అదనపు బస్సు సర్వీసులు నడపాలన్న డిమాండ్‌ పెరుగుతోంది.

మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులోకి వచ్చిన తర్వాత బస్సుల్లో రద్దీ మరింతగా పెరిగింది. బస్సు బస్టాండ్‌లోకి రాగానే సీటు కోసం మహిళలు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. బస్సుల్లో కూర్చోవడానికి మాత్రమే కాదు, నిలబడేందుకు కూడా తగినంత స్థలం లేక ప్రయాణికులు నలిగిపోతున్నారు. వృద్ధులు, దివ్యాంగులు బస్సుల్లో ఎక్కడం, దిగడం మరింత కష్టసాధ్యమవుతోంది.

కొన్ని మార్గాల్లో డ్రైవర్లు స్టేజీల వద్ద ప్రయాణికులు ఉన్నా బస్సులను ఆపకుండా వెళ్లిపోతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మరోవైపు, పాతబడ్డ బస్సులు తరచూ మొరాయించి, మార్గమధ్యంలోనే ఎక్కడపడితే అక్కడ నిలిచిపోతున్నాయి. దీంతో ప్రయాణికులు ప్రైవేట్‌ వాహనాలు, ఆటోలను ఆశ్రయించాల్సి వస్తోంది. దీంతో వారి ప్రయాణ వ్యయం కూడా పెరుగుతోంది.

స్త్రీశక్తి పథకం అమల్లోకి రాకముందు జిల్లాలో రోజుకు సుమారు లక్ష మంది బస్సుల్లో ప్రయాణిస్తుండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 1.40 లక్షలకు పెరిగింది. జిల్లాలో మొత్తం బస్సులు 386 ఉండగా, అందులో 121 అద్దె బస్సులు. వీటిలో సుమారు 130 బస్సులు కాలం చెల్లినవే. అయినప్పటికీ వాటిని మరమ్మతులు చేయించి రోడ్లపై నడుపుతున్నారు. ఫలితంగా తరచూ సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయని ప్రయాణికులు చెబుతున్నారు.

కదిరి నుంచి అనంతపురం, హిందూపురం నుంచి అనంతపురం మార్గాల్లో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సు సర్వీసులు లేవని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్గాల్లో ప్రయాణించే వారు ఎక్కువగా నిలబడి ప్రయాణించాల్సి వస్తోంది. బస్సుల కోసం కొందరు గంటల కొద్దీ బస్టాండ్‌లలో నిరీక్షించాల్సి వస్తోందని వారు చెబుతున్నారు.

ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు బస్సు సర్వీసులు 67 ఇవ్వాలని ప్రతిపాదనలు పంపాం. రద్దీకి అనుగుణంగా 20 బస్సులను కేటాయించాలని ఉన్నతాధికారులను కోరాం. పుట్టపర్తి, కదిరి, హిందూపురం నుంచి అనంతపురం వెళ్లే బస్సుల్లో రద్దీ అధికంగా ఉంది. ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా సర్వీసులు నడుపుతున్నాం.

అని ఆర్‌ఎం మధుసూదన్‌ తెలిపారు. జిల్లాలో పెరుగుతున్న రద్దీ దృష్ట్యా ప్రతిపాదించిన అదనపు బస్సుల కేటాయింపుపై ఉన్నతాధికారులు త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలనే అభిప్రాయం ప్రయాణికులలో వ్యక్తమవుతోంది.