పుట్టపర్తి: జిల్లాలో ఆర్టీసీ బస్టాండ్ల పరిస్థితి రోజురోజుకూ దారుణంగా మారుతోంది. బస్సెక్కే ప్రయాణికులకు కనీస సౌకర్యాలే లేని దుస్థితి నెలకొంది. తాగునీరు, పరిశుభ్రమైన మరుగుదొడ్లు, చెత్తకుండీలు వంటి ప్రాథమిక వసతులు చాలా చోట్ల కనిపించకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

జిల్లాలోని ఎక్కువ బస్టాండ్లు చెత్త, ప్లాస్టిక్‌ వ్యర్థాలు, బహిరంగ మూత్రవిసర్జనతో దుర్వాసనతో నిండిపోతున్నాయి. ప్రాంగణాలన్నీ అస్వచ్ఛంగా మారి ప్రయాణికులు గంటసేపు కూడా నిలబడలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదికలో బస్టాండ్ల నిర్వహణలో అనంతపురం జిల్లా చివరి నుంచి మూడో స్థానంలో నిలవడం స్థానిక స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.

ఈ పరిస్థితులపై వివరణ కోరగా ఆర్‌ఎం మధుసూదన్‌ స్పందించారు. అన్ని బస్టాండ్లలో ప్రయాణికుల కోసం అవసరమైన సదుపాయాలు కల్పించామని, ఎక్కడైనా అసౌకర్యాలు ఉన్నట్లయితే ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

బస్టాండ్లలో మూత్రశాలలు, మరుగుదొడ్ల నిర్వహణను అధికార యంత్రాంగం ప్రైవేట్‌ ఏజెన్సీలకు అప్పగించింది. నిబంధనల ప్రకారం మూత్రశాలలు పూర్తిగా ఉచితం కాగా, మరుగుదొడ్ల వినియోగానికి రూ.2 మాత్రమే వసూలు చేయాలి. అయితే వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంది. చాలా బస్టాండ్లలో మూత్రశాలలకు రూ.5, మరుగుదొడ్లకు రూ.10 వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆక్షేపిస్తున్నారు.

తాగునీటి విషయంలోనూ ఇబ్బందులు తీరడం లేదు. కదిరి బస్టాండులో ఆర్వో ప్లాంట్ల నిర్వహణ సరిగా లేకపోవడంతో ప్రయాణికులు శుద్ధజలానికి నోచుకోవడం లేదు. కదిరి–రాయచోటి బస్టాండులో నీళ్ల క్యాన్‌ను ఉంచినా అది సరిపోవడం లేదు. అనంతపురం, కళ్యాణదుర్గం, రాయదుర్గం, గుంతకల్లు, పుట్టపర్తి, ధర్మవరం, పెనుకొండ, హిందూపురం బస్టాండ్లలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. దీంతో ప్రయాణికులు రూ.20 చెల్లించి నీళ్ల సీసాలు కొనాల్సి వస్తోంది.

ధర్మవరం బస్టాండులో దాదాపు పదేళ్ల క్రితం రూ.10 లక్షల వ్యయంతో మూత్రశాలలు నిర్మించినా, వాటికి నీటి సరఫరా లేకపోవడంతో ప్రయాణికులు వినియోగించలేకపోతున్నారు. మహిళల మూత్రశాలలు నిర్వహణ లేక దుర్వాసనతో నిండిపోవడంతో వాటి వద్దకు వెళ్లేందుకు కూడా మహిళలు వెనుకంజ వేస్తున్నారు. గుంతకల్లు, కళ్యాణదుర్గం, కదిరి, పుట్టపర్తి, పెనుకొండ బస్టాండ్లలో మూత్రశాలలకు డబ్బులు వసూలు చేస్తున్నప్పటికీ, శుభ్రత, నిర్వహణలో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది.

స్త్రీశక్తి పథకం అమల్లోకి వచ్చిన తర్వాత బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ గణనీయంగా పెరిగింది. అయితే అందుకు అనుగుణంగా సౌకర్యాలు పెరగకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాదాపు అన్ని బస్టాండ్లలో కూర్చునే కుర్చీల సంఖ్య తక్కువగా ఉండటంతో ఎక్కువసేపు నిలబడి ప్రయాణం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రస్తుతం 13 బస్టాండ్ల నుంచి 808 బస్సులు నడుస్తున్నాయి. రోజూ సుమారు 3.50 లక్షల మంది ప్రయాణికులు ఈ బస్టాండ్లను వినియోగిస్తున్నా, వారికి తగిన సౌకర్యాల కల్పనలో అధికారుల నిర్లక్ష్యం కొనసాగుతుండటంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.