తమిళనాడు కన్యాకుమారి జిల్లాలో ప్రముఖ యూట్యూబర్‌ మధుమిత ఇంట్లో భారీ దొంగతనం చోటుచేసుకుంది. ఆమె నివాసంలో దొంగలు హల్‌చల్‌ చేయడంతో స్థానికంగా కలకలం రేగింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసుల సమాచారం ప్రకారం, మధుమిత తన యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా వ్యక్తిగత జీవితం, ఆస్తి సంబంధిత విషయాలను తరచూ వీడియోల రూపంలో సోషల్‌ మీడియాలో పంచుకుంటూ ఉండేవారు. ముఖ్యంగా ఇంట్లో ఉన్న బంగారం, నగదు వంటి విలువైన వస్తువులను కూడా వీడియోలు తీసి అప్‌లోడ్‌ చేసినట్లు తెలిసింది.

ప్రతి నెల బంగారం కొనుగోలు చేస్తున్నానని మధుమిత ఇటీవల తన యూట్యూబ్‌ వీడియోలో తెలిపినట్లు సమాచారం. పూజా గదిలో నిల్వ ఉంచిన బంగారం, నగదు గురించి కూడా ఆమె ఒక వీడియో రికార్డు చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఆ వీడియో అప్‌లోడ్‌ అయిన కొద్ది రోజులకే ఈ దొంగతనం జరగడం గమనార్హంగా మారింది.

దొంగలు ఇంటి వెనుక భాగంలో ఉన్న తలుపును పగులగొట్టి లోపలికి ప్రవేశించినట్లు ప్రాథమిక దర్యాప్తులో బయటపడింది. ఇంట్లోని అల్మారాలు, లాకర్లు చెక్‌ చేసిన దొంగలు సుమారు 960 గ్రాముల బంగారం, దాదాపు కోటి రూపాయల నగదును ఎత్తుకెళ్లినట్లు మధుమిత పోలీసులకు తెలిపినట్టు సమాచారం.

దొంగతనం జరిగిన విషయం తెలిసిన వెంటనే మధుమిత స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఇంటి వద్దకు చేరుకుని క్లూస్‌ టీమ్‌ సహాయంతో సాక్ష్యాధారాలు సేకరించారు. పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.

మధుమిత సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన వీడియోలు, వాటి టైమ్‌లైన్‌, దొంగతనం జరిగిన సమయం మధ్య సంబంధాన్ని కూడా పోలీసులు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఆమె ఇంటి భద్రతా ఏర్పాట్లు, దొంగలు ఎలా సమాచారం సేకరించి వచ్చారన్న కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.

ఈ ఘటనతో సోషల్‌ మీడియాలో వ్యక్తిగత ఆస్తి, విలువైన వస్తువుల వివరాలను బహిరంగంగా ప్రదర్శించడం ఎంతవరకు సమంజసం అనే చర్చ మొదలైంది. యూట్యూబర్‌లు, ఇన్‌ఫ్లుయెన్సర్‌లు తమ వ్యక్తిగత భద్రతను దృష్టిలో పెట్టుకుని కంటెంట్‌ రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.