రాయలసీమ న్యూస్, టెక్నాలజీ డెస్క్: భారతదేశంలోని ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ తన 5G వినియోగదారులకు సంబంధించిన రెండు కీలక మార్పులను అమలు చేసింది. 2023లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన అన్‌లిమిటెడ్ 5G డేటా ఆఫర్ వినియోగంపై, ముఖ్యంగా మొబైల్ హాట్‌స్పాట్ ద్వారా డేటా షేరింగ్ విషయంలో, ఇటీవల సోషల్ మీడియాలో విస్తృత చర్చ నడుస్తోంది.
అన్‌లిమిటెడ్ 5G డేటా ఆఫర్‌ను హాట్‌స్పాట్ ద్వారా ఇతర పరికరాలకు షేర్ చేయడానికి ప్రయత్నించినప్పుడు అనేక మంది వినియోగదారులు సమస్యలు ఎదుర్కొంటున్నారని, దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌లు ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఎయిర్‌టెల్ తన వెబ్‌సైట్‌లోని నిబంధనలు, షరతుల పేజీని అప్‌డేట్ చేస్తూ హాట్‌స్పాట్ వినియోగంపై స్పష్టతనిచ్చింది.
అప్‌డేట్ చేసిన నిబంధనల ప్రకారం, అపరిమిత 5G డేటా సదుపాయం పూర్తిగా వ్యక్తిగత, వాణిజ్యేతర వినియోగం కోసం మాత్రమే ఉద్దేశించబడింది. అంటే ఎయిర్‌టెల్ సిమ్ ఉన్న మొబైల్ పరికరంలోనే ఈ అపరిమిత 5G డేటాను ఉచితంగా వినియోగించుకోవచ్చు.
వినియోగదారులు తమ ఫోన్‌లో హాట్‌స్పాట్ ఆన్ చేసి ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు లేదా ఇతర ఫోన్‌లకు ఇంటర్నెట్‌ను షేర్ చేసినప్పుడు, ఆ డేటా ఉచిత అన్‌లిమిటెడ్ 5G కోటా నుంచి కాకుండా, ఆయా కస్టమర్‌కు ఉన్న రోజువారీ రెగ్యులర్ 4G లేదా 5G ప్లాన్ పరిమితి నుంచే మైనస్ అవుతుంది. ఈ విధంగా హాట్‌స్పాట్ ద్వారా షేర్ చేసిన డేటా మొత్తం సాధారణ ప్లాన్ డేటా వినియోగంగానే పరిగణించబడుతుంది.
అదనంగా, ఈ అపరిమిత 5G ప్లాన్‌పై ప్రతి 30 రోజులకు 300GB ఫెయిర్ యూసేజ్ పాలసీ వర్తిస్తుందని ఎయిర్‌టెల్ స్పష్టం చేసింది. ఈ పరిమితిని దాటే విధంగా, కమర్షియల్ బ్రాడ్‌బ్యాండ్‌లా అధికంగా వినియోగించినట్లు గుర్తిస్తే, సంబంధిత కనెక్షన్‌ను నిలిపివేసే హక్కు కంపెనీకి ఉంటుందని నిబంధనల్లో పేర్కొంది.
ఇక పోస్ట్‌పెయిడ్ సేవల విషయంలో కూడా ఎయిర్‌టెల్ మార్పులు చేసింది. కంపెనీ తన పోస్ట్‌పెయిడ్ పోర్ట్‌ఫోలియోలో ఉన్న రూ.549 ఇండివిడ్యువల్ ప్లాన్‌ను నిశ్శబ్దంగా తొలగించింది. ప్రస్తుతం ఈ ప్లాన్ ఎయిర్‌టెల్ అధికారిక వెబ్‌సైట్‌లో గానీ, ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్‌లో గానీ కనిపించడం లేదు.
ఈ మార్పుపై కంపెనీ నుంచి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, కొత్తగా పోస్ట్‌పెయిడ్ కనెక్షన్ తీసుకోవాలనుకునే వినియోగదారులకు ఆప్షన్లు తగ్గినట్టే అయ్యాయి. ప్రస్తుతం ఎయిర్‌టెల్‌లో అందుబాటులో ఉన్న అత్యంత చౌకైన ఎంట్రీ లెవల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ రూ.449 ఇండివిడ్యువల్ ప్లాన్ మాత్రమే. మరింత ప్రయోజనాలు కోరుకునే కస్టమర్లు ఇప్పుడు నేరుగా రూ.699 ఫ్యామిలీ ప్లాన్‌కు అప్‌గ్రేడ్ కావాల్సి వస్తుంది. ఈ ప్లాన్‌లో ఒక ప్రైమరీ కనెక్షన్‌తో పాటు ఒక అదనపు యాడ్-ఆన్ సిమ్ ఉచితంగా లభిస్తుంది.
మిగిలిన ప్రీమియం పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల ధరల్లో ఎయిర్‌టెల్ ఎలాంటి మార్పులు చేయలేదు. తాజా నిబంధనలు, ప్లాన్ మార్పులు 5G డేటా వినియోగ విధానంపై, ముఖ్యంగా హాట్‌స్పాట్ ఆధారిత వినియోగంపై, వినియోగదారుల ప్రవర్తనను ప్రభావితం చేసే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.







