డిజిటల్ ప్రపంచం నుంచి కొంత దూరంగా ఉండాలని భావించే వినియోగదారుల కోసం లైట్ కంపెనీ కొత్త లైట్ ఫ్లిప్ 5G ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఆధునిక స్మార్ట్‌ఫోన్‌లకు ప్రత్యామ్నాయంగా రూపొందించిన ఈ మినిమలిస్ట్ ఫోన్‌లో సోషల్ మీడియా యాప్‌లు, వెబ్ బ్రౌజర్, ప్రకటనలతో నిండిన యాప్‌లు వంటి దృష్టి మరల్చే ఫీచర్లకు పూర్తిగా దూరంగా ఉంచారు. క్లాసిక్ క్లామ్‌షెల్ ఫ్లిప్‌ డిజైన్‌తో పాటు కొత్త హార్డ్‌వేర్‌ను కలిపి, అవసరమైన పనులకే పరిమితమైన డిజిటల్ అనుభవాన్ని అందించేలా ఈ ఫోన్‌ను డిజైన్‌ చేశారు.

ఈ ఫోన్‌లో కంపెనీ అభివృద్ధి చేసిన లైట్ OS ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందించారు. ఈ సిస్టమ్‌లో సోషల్ మీడియా యాప్‌లు, వెబ్ బ్రౌజర్ లేదా నిరంతరం నోటిఫికేషన్‌లతో ఇబ్బంది పెట్టే యాప్‌లు ఉండవు. బదులుగా రోజువారీ అవసరాలకు ఉపయోగపడే ఫీచర్లపై మాత్రమే దృష్టి పెట్టారు. ప్రెడిసిటివ్ T9 టైపింగ్, Voice-to-Text, ఆడియో మెసేజింగ్, 9 స్పీడ్ డయల్ షార్ట్‌కట్‌లు వంటి కమ్యూనికేషన్ టూల్స్‌ను ఇందులో కలిపారు.

వినియోగదారుల దైనందిన అవసరాలను దృష్టిలో ఉంచుకుని లైట్ ఫ్లిప్ లో అలారం, క్యాలెండర్, కాలిక్యులేటర్, డైరెక్టరీ, నావిగేషన్, మొబైల్ హాట్‌స్పాట్, మ్యూజిక్ ప్లేయర్, నోట్స్, వాయిస్ మెమో, పోడ్‌కాస్ట్, వాతావరణ సమాచారం, 2FA ఆథెంటికేటర్, టైమర్ వంటి పలు ఉపయోగకరమైన టూల్స్‌ను అందించారు. అలాగే డెవలపర్ ప్రోగ్రామ్ ద్వారా కమ్యూనిటీ రూపొందించే ఓపెన్ సోర్స్ టూల్స్‌కు కూడా సపోర్ట్‌ను కల్పిస్తున్నారు.

లైట్ ఫ్లిప్ లో 2.8 అంగుళాల OLED డిస్‌ప్లే (480×640 పిక్సెల్స్)ను మ్యాట్ ఫినిష్‌తో అందించారు. మీడియా Tek MT8873 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది. 6GB LPDDR4X RAM, 128GB UFS 2.2 ఇంటర్నల్ స్టోరేజ్‌ను ఇందులో కలిపారు. ఫొటోగ్రఫీ కోసం 50MP రియర్ కెమెరాను అందించారు. ఇది 12MP ఫొటోలను క్యాప్చర్ చేయగలదు. కెమెరాతో పాటు ఇంటిగ్రేటెడ్ ఫ్లాష్‌లైట్ కూడా ఉంది.

కనెక్టివిటీ పరంగా 5G, Dual 4G VoLTE, Wi-Fi 6, Bluetooth 5.0, GPS, GLONASS, USB Type-C పోర్ట్‌ను అందించారు. అలాగే 3.5mm హెడ్‌ఫోన్ జాక్, స్టీరియో స్పీకర్లు, IP54 డస్ట్ & స్ప్లాష్ రెసిస్టెన్స్, 1800mAh రీప్లేస్ చేయగల బ్యాటరీ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

లైట్ ఫ్లిప్ ను నలుపు, నేవీ, ఎరుపు, గులాబీ, పసుపు, లేత బూడిద రంగుల్లో మార్కెట్లోకి తీసుకురానున్నారు. ఫోన్‌కు చార్మ్స్ లేదా యాక్సెసరీలు అమర్చుకునేందుకు ప్రత్యేక లూప్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఈ ఫోన్ ధర 299 అమెరికన్ డాలర్లు, భారతీయ కరెన్సీలో సుమారు రూ.28,870. అలాగే కంపెనీ సర్వీస్ ప్లాన్‌తో నెలకు 39 డాలర్ల EMI ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది.

ప్రస్తుతం లైట్ ఫ్లిప్ 5G ఫోన్‌కు ప్రీ-బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. డెలివరీలు నాలుగు విడతల్లో జరగనున్నాయి. తొలి విడత 2027 ఏప్రిల్ ప్రారంభంలో, రెండో విడత ఏప్రిల్ చివర్లో, మూడో విడత మే ప్రారంభంలో, నాలుగో విడత మే చివర్లో వినియోగదారులకు ఫోన్‌ను అందించనున్నారు.