టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ గేమింగ్‌ విభాగం ఎక్స్‌బాక్స్‌లో త్వరలోనే మరో విడత ఉద్యోగుల తొలగింపులు జరగనున్నాయనే సమాచారం వెలువడింది. వ్యాపారం ఆశించిన స్థాయిలో లాభదాయకంగా లేకపోవడం, విభాగంలో సమగ్ర మార్పులు అవసరమని మేనేజ్‌మెంట్‌ భావిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకునే అవకాశముందని అంతర్జాతీయ మీడియా కథనాలు సూచిస్తున్నాయి.

గత ఐదేళ్లలో ఎక్స్‌బాక్స్‌ కంటెంట్‌, ప్లాట్‌ఫామ్‌ అభివృద్ధి కోసం మైక్రోసాఫ్ట్‌ సుమారు 20 బిలియన్‌ డాలర్లు వెచ్చించినప్పటికీ, ఆ పెట్టుబడికి తగిన స్థాయిలో ఆదాయం రాలేదని సంస్థ అంతర్గతంగా అంచనా వేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఉద్యోగులకు పంపిన మెమోలో కంపెనీ ప్రస్తావించినట్టు వార్తలు వెలువడ్డాయి.

ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌ 30తో ముగిసిన తర్వాత కొత్త ఆర్థిక సంవత్సరంలో భాగంగా లేఆఫ్‌లను అమలు చేయాలని మైక్రోసాఫ్ట్‌ యోచిస్తున్నట్లు సమాచారం. అయితే ఎన్ని ఉద్యోగాలపై ఈ తొలగింపుల ప్రభావం పడనుందో, ఏఏ విభాగాల్లో కోతలు ఉండబోతున్నాయో స్పష్టత రాలేదు.

ఇప్పటికే గతేడాది మైక్రోసాఫ్ట్‌ ప్రపంచవ్యాప్తంగా సుమారు 9 వేల మందికి లేఆఫ్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో కూడా ఎక్స్‌బాక్స్‌ గేమింగ్‌ విభాగంలో గణనీయమైన సంఖ్యలో ఉద్యోగాలు కోతకు గురయ్యాయి. ఇప్పుడు మరో విడత లేఆఫ్‌లు రావచ్చన్న సమాచారం ఉద్యోగుల్లో ఆందోళనకు కారణమవుతోంది.

ఈ ఏడాది ప్రారంభంలో ఆశా శర్మ ఎక్స్‌బాక్స్‌కు సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు. మైక్రోసాఫ్ట్‌ గేమింగ్‌ ఆదాయ వృద్ధి మందగించడం, గేమింగ్‌ కంటెంట్‌ రంగంలో ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన పోటీ నెలకొనడం వంటి సవాళ్ల నడుమ ఆమె ఈ పదవిని చేపట్టడం విశేషంగా భావిస్తున్నారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎక్స్‌బాక్స్‌ వ్యాపార వ్యూహంలో భారీ మార్పులకు ఆమె శ్రీకారం చుట్టినట్లు కంపెనీ వర్గాలు సూచిస్తున్నాయి.

గేమింగ్‌ రంగంలో క్లౌడ్‌ సేవలు, సబ్‌స్క్రిప్షన్‌ మోడళ్లు, కొత్త కంటెంట్‌ అభివృద్ధి వంటి అంశాల్లో భారీ పెట్టుబడులు అవసరమవుతున్నాయి. మరోవైపు వినియోగదారుల అభిరుచులు వేగంగా మారుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఖర్చులను నియంత్రించడంతో పాటు, లాభదాయకతను పెంచేందుకు మైక్రోసాఫ్ట్‌ పునర్వ్యవస్థీకరణ చర్యలు తీసుకుంటోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

అయితే తాజా లేఆఫ్‌లపై మైక్రోసాఫ్ట్‌ అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఉద్యోగుల తొలగింపుల ఖచ్చితమైన సంఖ్య, ప్రభావిత ప్రాంతాలు, విభాగాల వివరాలపై కంపెనీ నుంచి స్పష్టత వచ్చిన తర్వాతే పూర్తి చిత్రం బయటపడనుంది.