గూగుల్‌ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది జీవితాల్లో ఓ భాగం కావడం వెనక దాని సీఈవో సుందర్‌ పిచాయ్‌ ప్రతిభ ఉంది. ఇతర కంపెనీల అధినేతలకు భిన్నంగా ‘క్వైట్‌ లీడర్‌’గా పేరొందిన ఆయన, ఇటీవల స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ గ్రాడ్యుయేషన్‌ వేడుకలో ప్రసంగించారు. ఆ సందర్భంగా యువతకు ఆయన చెప్పిన మూడు విజయ సూత్రాలు...

సానుకూల దృక్పథం

ప్రపంచం నేడు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోంది. అవేవీ మన చేతుల్లో లేవు. కానీ చుట్టూ ఉన్న పరిస్థితులను ఎలా స్వీకరిస్తామనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. కాలిఫోర్నియా అంటే పచ్చదనంతో కూడిన ప్రాంతమని ప్రకటనల్లో చూపుతారు. నేనిక్కడకు వచ్చిన మొదటి రోజు కారులో ప్రయాణిస్తుండగా, ఎటు చూసినా ఎండి పోయినట్టున్న గడ్డి కనిపించింది. ఆ మాటే పైకి అనేశా. అప్పటి మా హోస్ట్‌ నన్ను సరిదిద్దుతూ... ‘మేము దాన్ని గోల్డెన్‌ (బంగారు రంగు) అంటాం’ అన్నారు. పరిస్థితులను సానుకూల కోణంలో చూడటమంటే ఇదే. నేను ఎండిపోయిన గడ్డిని చూసిన చోటే, ఆమె బంగారు రంగును చూశారు. మీరు కూడా ఇలా ప్రతి అంశాన్నీ సానుకూలంగా చూడండి.

కష్టమైన పనులు

కెరీర్‌లో సరైన మార్గంలోనే వెళ్తున్నానా అనే విషయం పదేళ్లపాటు నన్ను వేధించింది. అదే సమయంలో దాదాపు అసాధ్యమనిపించే ఒక పని చేసేందుకు అవకాశం లభించింది. ఒక మంచి బ్రౌజర్‌ తయారు చేయాలనుకున్నాం. సంస్థ పెద్దలు మాత్రం అది చాలా కష్టమని, వందలాది ఇంజినీర్లు అవసరమని భావించారు. మా దగ్గరున్నది పదిమందే. కానీ మా మీద మాకున్న నమ్మకంతో పని ప్రారంభించాం. నాలుగేళ్లపాటు కష్టపడి కొత్త బ్రౌజర్‌ లాంచ్‌ చేశాం. మొదటి ఏడాది చాలా పెద్ద సంఖ్యలో వినియోగదారులు వచ్చారు. తర్వాత పెద్దగా పురోగతి కనిపించలేదు. అప్పటి మైక్రోసాఫ్ట్‌ సీఈవో ఓ ఇంటర్వ్యూలో మా బ్రౌజర్‌ గురించి పట్టించుకోనక్కరలేదన్నారు. ఎవరైనా మనల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారంటే, సరైన మార్గంలో వెళ్తున్నట్లే. మేమూ నెమ్మదిగా విజయం సాధించాం. అందుకే కష్టమైన పనులే చేయండి. ఒకవేళ నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోలేకపోయినా, ఏదో ఒక గొప్ప విషయాన్ని తెలుసుకుంటాం.

ఉత్సాహపరిచేలా...

కొన్నేళ్ల క్రితం భారతీయ పల్లెల్లో ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ ఫోన్లను మొదటిసారి ఉపయోగిస్తూ, సరికొత్తగా ఉపాధి అవకాశాలను సృష్టించుకున్న ఓ మహిళల బృందాన్ని కలిశాను. అనంతరం పిట్స్‌బర్గ్‌లోని ఓ తరగతి గదిని సందర్శించినప్పుడు వివిధ నేపథ్యాల నుంచి వచ్చిన విద్యార్థులు చదువుకోవడానికి నేను రూపొందించిన సాంకేతికతను ఉపయోగిస్తూ కనిపించారు. ఇలా సాంకేతికత అందరికీ అందుబాటులోకి రావడం, అందులో నా ప్రమేయం ఉండటం నాకు ఉత్సాహాన్నిస్తుంది. బాగా పనిచేసే శక్తినిస్తుంది. మీరు కూడా మీదైన సొంత మార్గాన్ని ఎంచుకోండి. మీరు ఏ విషయం గురించి ఉత్సాహంగా మాట్లాడుతున్నారో, ఆ రంగంలో పనిచేసేందుకు ప్రయత్నించండి. అప్పుడే విజయం మిమ్మల్ని వరిస్తుంది.

_ ఇంటర్నెట్ నుంచి సేకరణ