రాయలసీమ న్యూస్, టెక్నాలజీ డెస్క్:
విచ్చలవిడి ఏఐ వాడకంతో కరెంట్, నీటి కష్టాలు తీవ్రం.. సంక్షోభంపై ఐక్యరాజ్య సమితి హెచ్చరిక
హైదరాబాద్:- ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తున్న కృత్రిమ మేధస్సు వినియోగం భవిష్యత్తులో మరింత సమర్థవంతమై, తక్కువ శక్తిని వినియోగిస్తుందని చాలామంది నమ్ముతున్నారు. దాంతో పర్యావరణంపై ఒత్తిడి తగ్గుతుందని ఉన్న ఈ అంచనాలను ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక ఖండించింది. సాంకేతికత సామర్థ్యం పెరిగేకొద్దీ వనరుల వినియోగం తగ్గకపోగా, మరింత పెరుగుతుందనే ఆర్థిక సూత్రం ‘జెవాన్స్ పారడాక్స్’ ఉచ్చులో ఏఐ చిక్కుకుందని ఐరాస స్పష్టం చేసింది.
19వ శతాబ్దంలో ఇంగ్లాండ్‌లో బొగ్గు వినియోగంపై ఆర్థికవేత్త విలియం స్టాన్లీ జెవాన్స్ ప్రతిపాదించిన ఈ సిద్ధాంతం ఇప్పుడు ఏఐ రంగానికీ వర్తిస్తోందని నివేదిక పేర్కొంది. ఏఐ మరింత చౌకగా, ఆకర్షణీయంగా మారే కొద్దీ దాని వినియోగం విపరీతంగా పెరిగి, పర్యావరణంపై తీవ్రమైన భారం మోపే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
రాబోయే కొద్ది సంవత్సరాల్లో ఏఐ వల్ల పర్యావరణానికి కలిగే నష్టం ఊహాతీతమని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. 2030 నాటికి ఏఐ మోడల్స్, డేటా సెంటర్ల విద్యుత్ వినియోగం రెట్టింపై, ప్రపంచ మొత్తం విద్యుత్ వినియోగంలో 3 శాతానికి చేరుకునే అవకాశం ఉందని నివేదికలో వెల్లడించింది. గత ఏడాదిలోనే ఏఐ మౌలిక సదుపాయాలు సౌదీ అరేబియా దేశం మొత్తం వినియోగించే విద్యుత్తుకు సమానమైన శక్తిని మింగేశాయని వివరించింది.
ఏఐ వల్ల ఉద్గారమయ్యే కార్బన్‌ను సమతుల్యం చేయాలంటే 6.7 బిలియన్ల చెట్లను నాటి, కనీసం పదేళ్ల పాటు పెంచాల్సి వస్తుందని ఐరాస లెక్కలు చెబుతున్నాయి. ఇది యునైటెడ్ కింగ్డమ్ దేశం విడుదల చేసే మొత్తం కార్బన్ ఉద్గారాలకు సమానమని నివేదికలో పేర్కొంది. అలాగే డేటా సెంటర్లను చల్లబరచడానికి ఏకంగా 9.3 ట్రిలియన్ లీటర్ల నీరు అవసరమవుతుందని, ఇది ప్రపంచ జనాభా ఏడాది పాటు తాగునీటి అవసరాన్ని మించే పరిమాణమని హెచ్చరించింది.
డేటా సెంటర్ల ఏర్పాటుకు మెక్సికో సిటీ కంటే పది రెట్లు పెద్ద భూభాగం అవసరమవుతుందని నివేదిక వెల్లడించింది. ఈ ఏఐ బూమ్ వెనుక తీవ్రమైన అంతర్జాతీయ అసమానత దాగి ఉందని ఐక్యరాజ్య సమితి వేలెత్తి చూపింది. ప్రపంచవ్యాప్తంగా కేవలం 32 దేశాల్లో మాత్రమే ఏఐ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండగా, అందులోనూ 90 శాతం సామర్థ్యం అమెరికా, చైనా దేశాల చేతుల్లోనే కేంద్రీకృతమై ఉందని వివరించింది.
ఏఐ సాంకేతికతను సృష్టించి, నియంత్రించే దేశాలు ఒకవైపు ఉంటే, వాటిని కేవలం వినియోగించే పేద దేశాలు మరోవైపు ఉన్నాయని నివేదిక పేర్కొంది. అయితే ఏఐ తయారీకి అవసరమైన మైనింగ్, ఈ-వేస్ట్ వంటి పర్యావరణ భారాలన్నింటినీ ఈ పేద దేశాలే మోయాల్సి వస్తోందని ఐరాస ఆందోళన వ్యక్తం చేసింది.
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాలు తమ ప్రభుత్వ సేవల్లో ఏఐ వినియోగాన్ని వేగంగా పెంచుతున్నప్పటికీ, పర్యావరణ ప్రభావాలపై స్పష్టమైన నిబంధనలు, పర్యవేక్షణ వ్యవస్థలు లేవని నివేదికలో విమర్శించింది. టెక్నాలజీ అభివృద్ధి పేరిట ప్రకృతిని పణంగా పెట్టలేమని ఐరాస స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో పారదర్శకత, గ్లోబల్ కోఆపరేషన్, సస్టైనబుల్ యూజ్ అనే సూత్రాలపై ఆధారపడిన రోడ్‌మ్యాప్‌ను ఐక్యరాజ్య సమితి ప్రతిపాదించింది. ఏఐ వల్ల పర్యావరణానికి కలిగే నష్టాన్ని అధికారికంగా లెక్కించి వెల్లడించే విధానాలను ప్రతి దేశం అమలు చేయాలని పిలుపునిచ్చింది. ప్రకృతిని కేంద్రబిందువుగా చేసుకుని సరికొత్త ‘ఇన్నోవేషన్ ప్లేబుక్’ రూపొందించాల్సిన సమయం ఆసన్నమైందని యునైటెడ్ నేషన్స్ సూచించింది.







