రాయలసీమ న్యూస్, టెక్నాలజీ డెస్క్: డిజిటల్ చెల్లింపుల్లో యూజర్ల వ్యక్తిగత గోప్యతను మరింతగా కాపాడేందుకు నేషనల్ ప్రెమెంట్స్ కార్పొరేషన్ అఫ్ ఇండియా (NPCI) కీలక నిర్ణయాలు తీసుకుంది. యూనిఫైడ్ ప్రెమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) ఆధారిత లావాదేవీల్లో ఫోన్ నంబర్ల వినియోగం, ప్రదర్శన విధానంలో మార్పులు చేయాలని NPCI బ్యాంకులు, UPI యాప్స్‌కు సూచించింది.
ఇప్పటి వరకు UPI యాప్స్‌లో లావాదేవీలు జరిపే సమయంలో యూజర్ల పూర్తి ఫోన్ నంబర్లు కనిపించే పరిస్థితి ఉంది. దీనివల్ల ప్రైవసీ, భద్రత పరంగా కొన్ని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో యూజర్ల ఫోన్ నంబర్లు పూర్తిగా కనిపించకుండా, కేవలం చివరి నాలుగు అంకెలు మాత్రమే కనిపించేలా సాంకేతిక మార్పులు చేయాలని NPCI ఆదేశించినట్లు సమాచారం.
భద్రతను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో, ఫోన్ నంబర్ ఆధారిత UPI IDలకు బదులు యూజర్ నేమ్ ఆధారిత UPI IDలను ప్రవేశపెట్టాలని NPCI సూచించింది. అంటే, UPI లావాదేవీల్లో నేరుగా మొబైల్ నంబర్‌ను IDగా ఉపయోగించే విధానాన్ని తగ్గించి, ప్రత్యేకంగా యూజర్ నేమ్ ఆధారంగా గుర్తింపు ఉండేలా మార్పులు చేయాలని సూచనలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
డిజిటల్ చెల్లింపులు దేశవ్యాప్తంగా విస్తృతంగా పెరుగుతున్న నేపథ్యంలో, యూజర్ల వ్యక్తిగత సమాచారం రక్షణకు సంబంధించిన చర్యలు కీలకంగా మారాయి. UPI వ్యవస్థలో ఫోన్ నంబర్ ప్రదర్శనను పరిమితం చేయడం, యూజర్ నేమ్ ఆధారిత IDలను ప్రోత్సహించడం ద్వారా యూజర్ల ప్రైవసీ, భద్రత మరింత మెరుగుపడుతుందని నిపుణులు భావిస్తున్నారు.
NPCI తాజా మార్గదర్శకాలు అమల్లోకి వచ్చిన తర్వాత, UPI యాప్స్‌లో లావాదేవీలు చేసే సమయంలో యూజర్లు తమ పూర్తి ఫోన్ నంబర్ బహిర్గతం అవుతుందనే ఆందోళన లేకుండా చెల్లింపులు చేయగలరని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. బ్యాంకులు, UPI యాప్ సంస్థలు నిర్దేశిత గడువులోపు అవసరమైన సాంకేతిక మార్పులు పూర్తి చేయాల్సి ఉంటుంది.







