రాయలసీమ న్యూస్, టెక్నాలజీ డెస్క్: ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా కొత్త వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రకటించింది. రూ.4,600 ధరతో ఈ ప్లాన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న 4జీ, 5జీ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని అపరిమిత కాల్స్, డేటా సదుపాయాలతో ఈ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది.
కంపెనీ సమాచారం ప్రకారం ప్రస్తుతం ఈ ప్లాన్ కొన్ని టెలికాం సర్కిళ్లలో మాత్రమే లభ్యమవుతోంది. త్వరలో అన్ని సర్కిళ్లకు విస్తరించేలా చర్యలు చేపడుతోంది. ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుండటం విశేషం. రోజూ అపరిమిత డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ సదుపాయం లభిస్తుంది. అదనంగా రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు అందుబాటులో ఉంటాయి.
ఈ ప్లాన్‌ను వ్యక్తిగత, నాన్ కమర్షియల్ వినియోగం కోసం మాత్రమే రూపొందించినట్లు వొడాఫోన్ ఐడియా స్పష్టం చేసింది. 5జీ నెట్‌వర్క్ కవరేజీ ఉన్న ప్రాంతాల్లో వినియోగదారులకు 5జీ అపరిమిత డేటా సదుపాయం లభిస్తుంది. అపరిమిత డేటా అందుబాటులో ఉన్నప్పటికీ, వినియోగంపై కొన్ని పరిమితులు వర్తిస్తాయి.
కంపెనీ వివరాల ప్రకారం, ప్రతి 28 రోజుల కాలానికి గరిష్ఠంగా 300 జీబీ వరకు మాత్రమే డేటా వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఈ పరిమితిని మించిన తర్వాత ఇంటర్నెట్ వేగం తగ్గే అవకాశం ఉందని స్పష్టం చేసింది. మొత్తం వార్షిక ప్లాన్ ఖర్చును రోజువారీగా లెక్కిస్తే, రోజుకు సుమారు రూ.12.6 చొప్పున వినియోగదారులు చెల్లించాల్సి వస్తుంది.
వార్షిక ప్లాన్‌తో పాటు మధ్యకాల వినియోగదారుల కోసం మరో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను కూడా వొడాఫోన్ ఐడియా ప్రవేశపెట్టింది. 180 రోజుల వ్యాలిడిటీతో రూ.2,475 ధరలో ఈ ప్లాన్‌ను లాంచ్ చేసింది. ఈ ప్లాన్‌లో కూడా అపరిమిత డేటా, అపరిమిత వాయిస్ కాల్స్ సదుపాయాలు ఉంటాయి. రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి.
డేటా వినియోగ పరిమితి విషయంలో 6 నెలల ప్లాన్‌కు కూడా వార్షిక ప్లాన్ మాదిరిగానే నిబంధనలు వర్తిస్తాయని కంపెనీ పేర్కొంది. టెలికాం రంగంలో పెరుగుతున్న డేటా అవసరాలు, వినియోగదారుల దీర్ఘకాల ప్లాన్‌లపై ఉన్న ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని ఈ కొత్త ప్రీపెయిడ్ ఆఫర్లను తీసుకొచ్చినట్లు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.







