ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వినియోగదారులున్న మెసేజింగ్‌ ప్లాట్‌ఫామ్‌ వాట్సప్‌ కోసం టెక్‌ సంస్థ మెటా కొత్త గోప్యతా ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. వినియోగదారుల ఫోన్‌ నంబర్‌ రహస్యంగా ఉండేలా, ప్రత్యామ్నాయంగా యూజర్‌ నేమ్‌ ద్వారా చాట్‌ చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ ఏడాది చివర్లో ప్రపంచవ్యాప్తంగా విస్తృత స్థాయిలో ఈ ఫీచర్‌ను విడుదల చేయనున్నట్లు మెటా ఒక ప్రకటనలో తెలిపింది. దీనికి ముందస్తు ఏర్పాటుగా యూజర్‌ నేమ్‌లను రిజర్వ్‌ చేసుకునే ఆప్షన్‌ను ప్రారంభించింది.

ఆర్థిక, వ్యక్తిగత అంశాల్లో ఫోన్‌ నంబర్‌ అత్యంత కీలకమైన సమాచారం. కొత్త వ్యక్తులతో, సంస్థలతో సంప్రదింపులు ప్రారంభించే సమయంలో నంబర్‌ షేర్‌ చేయాల్సి రావడం వల్ల గోప్యతకు భంగం కలుగుతుందనే ఆందోళనలు వినియోగదారుల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వాట్సప్‌ యూజర్ల ప్రైవసీని మరింత బలోపేతం చేసేందుకు యూజర్‌ నేమ్‌ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇక నంబర్‌ షేర్‌ చేయకుండానే యూజర్‌ నేమ్‌ ద్వారా ఇతరులతో సంప్రదింపులు జరపడం సాధ్యమవుతుంది.

ఒక వ్యక్తిని తొలిసారి సంప్రదించాలంటే అతని యూజర్‌ నేమ్‌ తప్పనిసరిగా తెలిసి ఉండాలని వాట్సప్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (ప్రొడక్ట్‌) అలిస్‌ న్యూటన్‌ వెల్లడించారు. కొత్త ఫీచర్‌ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా వినియోగదారుల గోప్యత కోసం ఇప్పటికే ఉన్న బ్లాక్‌, సైలెన్సింగ్‌ అన్‌నోన్‌ కాలర్స్‌ వంటి నియంత్రణలు యథావిధిగా కొనసాగుతాయని ఆమె పేర్కొన్నారు.

రిజర్వ్‌ చేసుకోవాలనుకున్న యూజర్‌ నేమ్‌ పొడవు కనీసం మూడు, గరిష్టంగా 35 అక్షరాల వరకు ఉండొచ్చు. ఇందులో a-z, 0-9, డాట్‌, అండర్‌ స్కోర్‌ మాత్రమే ఉపయోగించాలి. www, చివర్లో .com, .net వంటి రూపాలు ఉపయోగించరాదు. అదనంగా నాలుగు అంకెలతో యూజర్‌ నేమ్‌ కీని కూడా సెట్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎవరికైనా మీతో మొదటిసారి సంప్రదింపులు ప్రారంభించాలంటే, మీ యూజర్‌ నేమ్‌తో పాటు ఆ కీని కూడా వారికి షేర్‌ చేయాల్సి ఉంటుంది.

Instagram, Facebook ఖాతాలున్న క్రియేటర్లు, వ్యాపార సంస్థలు తమ ప్రస్తుత ఖాతాలకు సరిపడేలా యూజర్‌ నేమ్‌ పొందేందుకు మెటా ప్రత్యేకంగా వీలు కల్పిస్తోంది. ఐరోపా, ఆసియా, ఇతర ప్రాంతాల్లో వాట్సప్‌ వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, కట్టుదిట్టమైన గోప్యతా నియంత్రణల కోసం వినియోగదారుల నుంచి వస్తున్న డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని ఈ ఫీచర్‌ను ప్రకటించింది.

ప్రస్తుతం ఈ సౌకర్యం పరిమిత సంఖ్యలో ఉన్న వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. మీ ఖాతాలో ఈ ఫీచర్‌ అందుబాటులో ఉందో లేదో తెలుసుకోవాలంటే వాట్సప్‌ ప్రొఫైల్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లి అక్కడ యూజర్‌ నేమ్‌ సెట్‌ చేసుకునే ఆప్షన్‌ కనిపిస్తుందేమో చూడవచ్చు. ఆప్షన్‌ కనిపించకపోతే, రాబోయే కొన్ని రోజుల్లో మీకు ఈ అప్‌డేట్‌ అందే అవకాశం ఉందని సంస్థ తెలిపింది.