రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తుర్కయంజాల్‌లోని న్యూ శ్రీ చైతన్య కాలేజీ ఎదుట శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థినులపై ఆదిభట్ల సర్కిల్ ఇన్‌స్పెక్టర్ లాఠీచార్జ్‌కు దిగిన ఘటన పెద్ద ఎత్తున సంచలనం రేపింది. విద్యాసంస్థ యాజమాన్యం నిర్లక్ష్యం ఒకవైపు, శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసు అధికారి స్వయంగా దౌర్జన్యానికి పాల్పడటం మరోవైపు తీవ్ర విమర్శలకు దారితీసింది.

బాధితులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం, తుర్కయంజాల్ పరిధిలోని న్యూ శ్రీ చైతన్య కాలేజీ లో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన పలువురు విద్యార్థినులు ఉన్నత విద్య కోసం అవసరమైన ఒరిజినల్ ఇంటర్ సర్టిఫికెట్లు కోసం గత కొన్ని రోజులుగా కాలేజీ యాజమాన్యాన్ని వరుసగా సంప్రదిస్తున్నారు. అయితే వివిధ కారణాలు చెబుతూ యాజమాన్యం సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఆలస్యం చేయడంతో విద్యార్థినులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

సర్టిఫికెట్లు సకాలంలో అందకపోతే తమ భవిష్యత్తు దెబ్బతింటుందనే ఆందోళనతో విద్యార్థినులు మంగళవారం ఉదయం కాలేజీ ప్రధాన గేటు ముందు ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు పట్టుకుని శాంతియుతంగా నిరసన కొనసాగించారు. ఈ ధర్నా కారణంగా కొద్దిసేపు కాలేజీ ఎదుట ట్రాఫిక్ నిలిచిపోయింది.

సమాచారం అందుకున్న ఆదిభట్ల సీఐ తన సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. అక్కడ నిరసన తెలుపుతున్నవారు ఎక్కువగా అమ్మాయిలేనన్న విషయం తెలిసినా, లేడీ కానిస్టేబుళ్లను ముందుకు పంపకుండా స్వయంగా విద్యార్థినులపై లాఠీచార్జ్ చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అమ్మాయిలని చూడకుండా ఇష్టం వచ్చినట్లు కొట్టిన సీఐ ప్రవర్తనపై అక్కడ ఒక్కసారిగా కలకలం రేగింది.

విద్యార్థినులపై జరిగిన ఈ దౌర్జన్య దృశ్యాలను అక్కడున్న కొందరు మొబైల్ ఫోన్లలో చిత్రీకరించారు. ఆ వీడియోలు కొద్ది నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. చట్ట ప్రకారం మహిళలను, విద్యార్థినులను పురుష పోలీసులు తాకడమే నేరమని, అలాంటిది ఒక సర్కిల్ ఇన్‌స్పెక్టర్ హోదాలో ఉండి బహిరంగంగా రోడ్డుపై అమ్మాయిలను కొట్టడం తీవ్రంగా ఖండనీయమని విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు, మహిళా కమిషన్ మండిపడుతున్నాయి.

న్యూ శ్రీ చైతన్య కాలేజీ లో ఇంటర్ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని విద్యార్థులు, విద్యార్థినులు కలిసి ఆందోళన చేపట్టారు. సర్టిఫికెట్లు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కాలేజీ ఎదుట ధర్నా కొనసాగించారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం తుర్కయంజాల్ వద్ద విద్యార్థులు, తల్లిదండ్రులు భారీ ఎత్తున రాస్తారోకోకు దిగారు.

ఆదిభట్ల సీఐని తక్షణమే విధుల నుండి సస్పెండ్ చేయాలని, విద్యార్థినులపై లాఠీచార్జ్‌కు కారణమైన శ్రీ చైతన్య కాలేజీ యాజమాన్యం, సంబంధిత పోలీసు అధికారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు లోతుగా విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.