రాయలసీమ న్యూస్, తెలంగాణ డెస్క్: రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నిర్మూలన, భద్రతా కమిటీల పనితీరుపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో డ్రగ్స్ నిరోధంపై ప్రభుత్వం అత్యంత సీరియస్‌గా ఉందని ఆయన స్పష్టం చేశారు. డ్రగ్స్ విస్తరణకు అడ్డుకట్ట వేయడానికి అత్యంత కఠినమైన నిబంధనలు తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ప్రత్యేకంగా విద్యాసంస్థలను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడే దిశగా సమగ్ర చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. విద్యాసంస్థల ఆవరణలో డ్రగ్స్‌కు సంబంధించి ఏ చిన్న ఘటన జరిగినా ఆ విద్యాసంస్థ యాజమాన్యాన్నే పూర్తి బాధ్యులుగా పరిగణించే విధంగా వ్యవస్థను రూపొందించాలని ఆయన స్పష్టం చేశారు. ఇందుకోసం విద్యాసంస్థలకు అవసరమైన అధికారాలతో పాటు స్పష్టమైన బాధ్యతలను కూడా అప్పగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
క్యాంపస్ వెలుపల జరిగే అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించి, వెంటనే పోలీసులకు సమాచారం అందించేందుకు అనువైన వ్యవస్థను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని సీఎం సూచించారు. విద్యార్థుల ప్రవర్తనలో వచ్చే మార్పులను ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు ప్రతి విద్యాసంస్థలో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసుకునేలా చూడాలని సంబంధిత శాఖల అధికారులకు సూచనలు జారీ చేశారు.
డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారాన్ని గోప్యంగా అందించేందుకు విద్యాసంస్థల ఆవరణలో టోల్ ఫ్రీ నెంబర్లు, ప్రత్యేక క్యూఆర్ కోడ్లను అందుబాటులో ఉంచే అవకాశాన్ని పరిశీలించాలని సీఎం సూచించారు. డ్రగ్స్ నిర్మూలనలో గుర్తించడం, మాన్పించడం, శిక్షించడం అనే మూడు దశలను సమర్థవంతంగా అమలు చేసేలా త్రీ-స్టెప్ యాక్షన్ ప్లాన్ రూపొందించాలని ఆయన ఆదేశించారు.
మొదటిసారి డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడిన వారిని వెంటనే డీ-అడిక్షన్ సెంటర్లకు తరలించి కౌన్సెలింగ్ అందించే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. అయితే పదే పదే డ్రగ్స్ కేసుల్లో పట్టుబడే వారిపై మాత్రం ఎలాంటి ఉపేక్ష లేకుండా కఠినంగా శిక్షించేలా నిబంధనలు అమలు చేయాలని ఆయన స్పష్టం చేశారు.
డ్రగ్స్ మహమ్మారిపై కఠినంగా వ్యవహరించేందుకు అవసరమైతే నూతన చట్టాన్ని రూపొందించే అంశంపై అధ్యయనం చేయాలని సీఎం ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వినియోగం, సరఫరా, రవాణా వంటి అంశాలపై సమగ్ర డేటా సేకరించి, దాని ఆధారంగా కఠిన చర్యలు తీసుకునేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.







