తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పదవీకాలంపై స్పష్టమైన వ్యాఖ్యలు చేశారు. ఫిన్‌లాండ్, జర్మనీ పర్యటన ముగించుకుని వచ్చిన ఆయన, ఉపాధ్యాయుల బృందంతో గురువారం ఎంసీఆర్‌హెచ్ఆర్‌డీలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర పరిపాలన, ప్రభుత్వ పాఠశాలల స్థాయి, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం వంటి అంశాలపై విస్తృతంగా మాట్లాడారు.

“2034 వరకు ఈ రాష్ట్రానికి నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను, దీనిపై ఎవరూ ఎలాంటి అనుమానాలు, డౌట్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు”

సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్వహణలో మానవత్వంతో వ్యవహరిస్తూ, ప్రజా సంక్షేమాన్ని ప్రధాన ధ్యేయంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నామని ఉపాధ్యాయులకు వివరించారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులతో చర్చించిన ఆయన, వారి సమస్యల పరిష్కార బాధ్యతను పూర్తిగా తానే తీసుకుంటానని హామీ ఇచ్చారు.

ఉపాధ్యాయుల ప్రమోషన్లు, బదిలీలు ఇంటికే వచ్చే విధంగా వ్యవస్థను రూపొందిస్తున్నామని, ఉపాధ్యాయులు తమ శ్రద్ధను విద్యార్థుల భవిష్యత్తు, బడులలో సౌకర్యాల మెరుగుదలపై కేంద్రీకరించాలని సూచించారు. ఐఏఎస్ అధికారులనైనా సులభంగా బదిలీ చేయవచ్చని, అయితే టీచర్ వ్యవస్థ అత్యంత శక్తివంతమైనదని ఆయన అభిప్రాయపడ్డారు. బడులలోని పిల్లల సమస్యలపై నేరుగా తనతో చర్చలకు రావాలని ఉపాధ్యాయులను పిలుపునిచ్చారు.

ప్రభుత్వ పాఠశాలల ప్రతిష్టను పెంచాలి

“ప్రభుత్వ బడులలో చదివితే ఏం అవుతావు?” అని ఎవరైనా అడిగితే, “తెలంగాణ సీఎం అవుతాను” అని పిల్లలు ధైర్యంగా చెప్పాలి

తాను స్వయంగా ప్రభుత్వ పాఠశాలలోనే చదివిన విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. ఎలాంటి మంత్రి పదవి అనుభవం లేకపోయినా, ఈరోజు సమర్థవంతంగా రాష్ట్రాన్ని పాలిస్తున్నానని ఉపాధ్యాయులకు వివరించారు. ఇటీవల తాను హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నానని చెప్పిన ఆయన, కేవలం తెలివి ఉంటే సరిపోదని, క్రమశిక్షణే మనిషిని ఉన్నత స్థానంలో నిలబెడుతుందని నొక్కి చెప్పారు.

ఉపాధ్యాయులు అడగకపోయినా 2024 జనవరి నుంచి ప్రతినెల ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తున్నామని, అవుట్‌సోర్సింగ్ సిబ్బందికి కూడా సమయానికి వేతనాలు అందుతున్నాయని సీఎం స్పష్టం చేశారు. హాస్టళ్లలో డైట్, కాస్మోటిక్ ఛార్జీలను కూడా పెంచినట్లు వివరించారు.

అమెరికాపైనే కాకుండా జర్మనీ, జపాన్ వంటి దేశాల వైపు కూడా దృష్టి సారించాలని, భాష అనేది కేవలం ఒక సంభాషణ మాధ్యమం మాత్రమేనని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రతి ఆరు నెలలకొకసారి ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమై సమస్యలు పరిష్కరించే వ్యవస్థను కొనసాగిస్తామని ఆయన హామీ ఇచ్చారు.