రాయలసీమ న్యూస్, తెలంగాణ డెస్క్: కొడంగల్: భాజపా, బీఆర్ఎస్ పార్టీల తప్పులను ప్రశ్నిస్తున్నందుకే తమపై కుట్రలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆరోపించారు. ఆ రెండు పార్టీలు వేరు వేరు అయినప్పటికీ లక్ష్యం మాత్రం ఒక్కటేనని వ్యాఖ్యానించారు. ఓటరు జాబితా సమగ్ర సవరణపై బీఎల్ఏలతో కొడంగల్లో సోమవారం నిర్వహించిన సమావేశంలో సీఎం మాట్లాడారు.
సమావేశంలో ఓటరు జాబితా సవరణ ప్రాముఖ్యతను సీఎం వివరించారు. కొడంగల్ నియోజకవర్గంలో ఇప్పటికే 78 శాతం ఓటర్లు నమోదు కాగా, మిగిలిన 22 శాతం అర్హులైన ఓటర్లను తప్పనిసరిగా నమోదు చేయాలని బీఎల్ఏలకు సూచించారు. ఎస్ఐఆర్ నమోదు ప్రక్రియను వేగవంతం చేసి, ఈ నెలాఖరుకల్లా శాతం వందకు చేర్చాలని ఆదేశించారు.
బీఎల్వోలు ప్రభుత్వాధికారులుగా, బీఎల్ఏలు పార్టీ కార్యకర్తలుగా తమ తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని ఆయన పిలుపునిచ్చారు. ఓటరు జాబితాలో పేరు లేకపోతే ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందకుండా పోతాయని, అందుకే ప్రతి అర్హుడి పేరు జాబితాలో ఉండేలా చూడాలని సూచించారు.
గతంతో పోలిస్తే ఓటర్ల వివరాలు సరైన విధంగా నమోదు కాకపోతే వాటిని పక్కన పెట్టే అవకాశం ఉంటుందని, అనుమానాస్పదంగా ఉన్న సందర్భాల్లో తగిన ఆధారాలు సమర్పించి ఓటర్లుగా నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉందని సీఎం పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో ఓటు వేసే వారి జాబితా ఇప్పుడే నిర్ణయమవుతున్నందున ఈ దశలో జరిగే నిర్లక్ష్యం భవిష్యత్తులో సమస్యలకు దారితీస్తుందని ఆయన హెచ్చరించారు.
కొడంగల్ నియోజకవర్గంలో అర్హులైన ఓటర్ల ఓట్లు తొలగించేందుకు ఎలాంటి ప్రయత్నాలనూ సహించబోమని సీఎం స్పష్టం చేశారు. తనపై జరుగుతున్న కుట్రలను ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎదుర్కొని, కుట్రలు పన్నేవారికి తగిన బుద్ధి చెప్పాలని బీఎల్ఏలు, కాంగ్రెస్ నాయకులను ఆయన కోరారు.
సమావేశంలో కొడంగల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల కాంగ్రెస్ నేతలు, బీఎల్ఏలు పాల్గొని ఓటరు జాబితా సవరణ, ఎస్ఐఆర్ నమోదు, ఓటర్ల అవగాహన కార్యక్రమాలపై చర్చించారు.







