రాయలసీమ న్యూస్, తెలంగాణ డెస్క్: రాష్ట్రంలో మహిళా సాధికారతను లక్ష్యంగా పెట్టుకుని ప్రజా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు. భారతీయ పరిశ్రమల సమాఖ్య మహిళా విభాగం FICCI లేడీస్ ఆర్గనాయిసెషన్ (FLO) ప్రధాన కార్యాలయ నిర్మాణం కోసం శిల్పారామం పక్కన వెయ్యి గజాల స్థలాన్ని కేటాయించనున్నట్లు ఆయన ప్రకటించారు.
FICCI లేడీస్ ఆర్గనాయిసెషన్ (FLO) ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ విభాగం ప్రతినిధులు ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారిని కలిశారు. భారతీయ పరిశ్రమల సమాఖ్య FICCI ఏర్పడి 2027 నాటికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకోనున్న నేపథ్యంలో నిర్వహించనున్న కార్యక్రమాల వివరాలను FLO ప్రతినిధులు ముఖ్యమంత్రికి తెలియజేశారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో మహిళా సాధికారత కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలను ముఖ్యమంత్రి వివరించారు. హైటెక్ సిటీ, కాన్ఫెడరేషన్ అఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) కార్యాలయానికి మధ్యలో FLO కార్యాలయం ఏర్పాటు చేయడం ద్వారా ఆ ప్రాంతం ప్రత్యేక ఆకర్షణగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులో కూడా FICCI భాగస్వామ్యం కావాలని ముఖ్యమంత్రి కోరారు. FICCI ప్రధాన కార్యాలయం కోసం ఒక ఎకరం స్థలాన్ని కేటాయించనున్నట్లు వెల్లడించారు. భారత్ ఫ్యూచర్ సిటీ లో ఫార్చ్యూన్ 500 కంపెనీలను నెలకొల్పాలన్నది ప్రభుత్వ సంకల్పమని, ఈ లక్ష్య సాధనలో FICCI మహిళా పారిశ్రామికవేత్తల పాత్ర కీలకమవుతుందని ఆయన పేర్కొన్నారు.
FICCI మహిళా విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇండస్ట్రియల్ పార్క్ విజయవంతమైన నేపథ్యంలో, మహిళా సాధికారతను మరింత బలోపేతం చేయడానికి మరో పారిశ్రామిక పార్క్ అభివృద్ధి చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. మహిళలు ఆర్థికంగా ఎదిగిన దేశాల్లో ఆర్థికాభివృద్ధి, జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉంటాయని ఆయన అన్నారు.
మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని, ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రత్యేక సమావేశం నిర్వహించి పురోగతిని సమీక్షించనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. వ్యాపార రంగంలో ప్రతిభ కనబరుస్తున్న మహిళా సంఘాలకు FICCI ఆధ్వర్యంలో ప్రతి ఏటా అవార్డులు అందజేసి గౌరవించాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ముఖ్యమంత్రి సలహాదారు కె. రామకృష్ణారావు, FLO జాతీయ అధ్యక్షురాలు పూజా గార్గ్, FLO హైదరాబాద్ చైర్ పర్సన్ సీతా రెడ్డి గడ్డం తో పాటు పలువురు మహిళా పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.







