రాయలసీమ న్యూస్, తెలంగాణ డెస్క్:
హైదరాబాద్‌లో కల్తీ మాంసం.. ఐదుగురు అరెస్ట్
మెహిదీపట్నం, వెలుగు: నగరంలో ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేలా కల్తీ మాంసం, కుళ్లిన చేపలు, రొయ్యలు విక్రయిస్తున్న గ్యాంగ్‌ను పోలీసులు పట్టుకున్నారు. హబీబ్‌నగర్, మంగళ్‌హాట్ పోలీస్‌స్టేషన్ పరిధుల్లో రెండు వేర్వేరు కేసుల్లో మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేసి, భారీగా కల్తీ మాంసం, పాడైపోయిన సముద్ర ఆహారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
హబీబ్‌నగర్ పరిధిలో మేక మాంసంలో ఎద్దు మాంసం కలిపి పెద్ద హోటళ్లకు తక్కువ ధరలకు సరఫరా చేస్తున్న మహమ్మద్ ఉస్మాన్ ఖురేషిని హెచ్-ఫాస్ట్ అధికారులు, పోలీసులు బుధవారం రాత్రి అరెస్ట్ చేశారు. మల్లేపల్లిలోని అతని షాపుపై దాడి చేసి సుమారు 50 కిలోల కల్తీ మాంసాన్ని సీజ్ చేశారు.
సీజ్ చేసిన మాంసాన్ని పరీక్షల కోసం చర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియా సమీపంలోని నాచారం వద్ద ఉన్న ‘తెలంగాణ స్టేట్ ఫుడ్ లాబొరేటరీ’కి పంపిస్తున్నట్లు సంబంధిత సర్కిల్ ఇన్స్పెక్టర్ తెలిపారు. మేక మాంసంగా చూపిస్తూ ఎద్దు మాంసం కలిపి విక్రయిస్తున్న ఈ అక్రమ వ్యాపారంపై మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
మరో కేసులో మంగళ్‌హాట్ పరిధిలోని ‘తార ఫిషరీస్’ దుకాణంపై టాస్క్‌ఫోర్స్, స్థానిక పోలీసులు సంయుక్త దాడి నిర్వహించారు. ఈ దుకాణంలో కుళ్లిన చేపలు, రొయ్యలు విక్రయిస్తున్న శంకర్ సింగ్ (24), మాన్ సింగ్ (32), గులాబ్ సింగ్ (36), రోహిత్ సింగ్ (31)లను అరెస్ట్ చేశారు.
బేగంబజార్ ప్రాంతం నుంచి తక్కువ ధరలకు కుళ్లిన నిల్వలను తెచ్చి, వాటికి వాసన రాకుండా సోడియం బైకార్బోనేట్ పౌడర్ కలిపి తాజా వాటిలా కనిపించేలా చేసి హోటళ్లకు, ఫంక్షన్లకు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ దాడిలో రూ.90 వేల విలువైన 100 కిలోల పాడైపోయిన రొయ్యలు, 162 కిలోల చేపలు, 10 కిలోల సోడియం బైకార్బోనేట్ పౌడర్, 6 బస్తాల ఉప్పును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నగరంలో ఆహార భద్రతను కాపాడేందుకు ప్రత్యేక దళాలతో కలిసి తనిఖీలు కొనసాగుతున్నాయని, కల్తీ ఆహార పదార్థాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. ఈ రెండు కేసుల్లోనూ సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, సరఫరా శృంఖల వెనుక ఉన్న ఇతర వ్యక్తులను గుర్తించే పనిలో ఉన్నట్లు తెలిపారు.







