రాయలసీమ న్యూస్, క్రైమ్ డెస్క్:
తెలంగాణ నుంచి ఏపీకి అక్రమంగా చికెన్ వ్యర్థాల రవాణా భగ్నం
అంతర్రాష్ట్రంగా జరుగుతున్న చికెన్ వ్యర్థాల అక్రమ రవాణా నెట్‌వర్క్‌ను హెచ్-ఫాస్ట్, జీహెచ్‌ఎంసీ వెటర్నరీ విభాగం సంయుక్త బృందాలు భగ్నం చేశాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో సోమవారం నిర్వహించిన దాడుల్లో 90 టన్నుల చికెన్ వ్యర్థాలు, వాటి రవాణాకు ఉపయోగించిన 7 వాహనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
హెచ్-ఫాస్ట్, జీహెచ్‌ఎంసీ బృందాలు అంబర్‌పేట్, కుల్సుంపురా, అత్తాపూర్, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో ఉన్న చికెన్ వ్యర్థాల నిల్వ కేంద్రాలపై ఏకకాలంలో దాడులు జరిపాయి. అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా చికెన్ వ్యర్థాలను తరలిస్తున్న 7 వాహనాలను అడ్డుకుని, వాటిలో ఉన్న 90 టన్నుల వ్యర్థాలను సీజ్ చేశారు.
జీహెచ్‌ఎంసీ పరిధిలో సేకరించే చికెన్ వ్యర్థాలను శాస్త్రీయంగా నిర్వీర్యం చేయడానికి చెంగిచెర్లలోని రెండరింగ్ కేంద్రానికి తరలించాల్సి ఉంటుంది. అయితే డ్రైవర్లు, నిర్వాహకులు ఈ విధానాన్ని పాటించకుండా, అక్రమంగా ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరం, ఏలూరు, భీమడోలు, ఉండి ప్రాంతాలతో పాటు తెలంగాణలోని నల్గొండ జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు ఈ వ్యర్థాలను తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
దర్యాప్తులో భాగంగా, అక్కడి చేపల చెరువుల్లో చేపలకు ఆహారంగా వినియోగించేందుకు ఈ చికెన్ వ్యర్థాలను తరలిస్తున్నట్లు బయటపడింది. పచ్చి చికెన్ వ్యర్థాలను సేకరించడం, నిల్వ చేయడం, చెరువుల్లో చేపలకు ఆహారంగా వినియోగించడం పూర్తిగా నిషేధితమని అధికారులు స్పష్టం చేశారు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు.
చికెన్ వ్యర్థాలను తిని పెరిగిన చేపలను మనుషులు ఆహారంగా తీసుకుంటే తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రజా ఆరోగ్య భద్రత దృష్ట్యా ఇలాంటి అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు.
ఈ దాడులు డీసీపీ వైభవ్ గైక్వాడ్ రఘునాద్ పర్యవేక్షణలో నిర్వహించారు. హెచ్-ఫాస్ట్ ఇన్‌స్పెక్టర్లు ఎన్. రంజిత్ కుమార్, ఎం. అంజయ్య, సబ్-ఇన్‌స్పెక్టర్లు, సిబ్బంది, జీహెచ్‌ఎంసీ వెటర్నరీ వైద్యులు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. పట్టుబడిన వాహనాలను పోలీస్ స్టేషన్‌కు తరలించి, తదుపరి చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్లు సమాచారం.







