ఎన్‌డీఎస్ఏ సూచనల మేరకే కాళేశ్వరం పునరుద్ధరణ చర్యలు:

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్ఏ) పర్యవేక్షణలో, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నియమించిన నిపుణుల కమిటీ సూచనలకు అనుగుణంగా కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ చర్యలు చేపడతామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బ్యారేజీల నిర్మాణం, నిర్వహణ, డిజైన్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్‌లో లోపాలు ఉన్నందున, ప్రస్తుత పరిస్థితుల్లో గేట్లు మూసి బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయడం ప్రమాదకరమని ఎన్‌డీఎస్ఏ సూచించిన నేపథ్యంలోనే గోదావరి నుంచి నీటిని ఎత్తిపోసే చర్యలు చేపట్టడం లేదని తెలిపారు.

ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధుల సమక్షంలో ఎంసీఆర్ హెచ్ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో ముఖ్యమంత్రి మీడియా సమావేశం నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో నీటిని నిల్వ చేసి ఎత్తిపోసే పరిస్థితులు లేకపోవడం, ఎన్‌డీఎస్ఏ నివేదికలో పేర్కొన్న అంశాలను ఆయన సమగ్రంగా వివరించారు.

గోదావరిలో నీరు పారుతున్నప్పటికీ, ఎన్‌డీఎస్ఏ సూచనల కారణంగా నీటిని ఎత్తిపోసే చర్యలు చేపట్టడం లేదని, దీనిపై ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కొందరు బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నందునే ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర వివరాలు ప్రజలకు తెలియజేస్తున్నామని ముఖ్యమంత్రి వివరించారు. ఎన్‌డీఎస్ఏ నివేదికను పరిగణలోకి తీసుకోకుండా, తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.

దేశవ్యాప్తంగా ప్రాజెక్టులు, డ్యామ్‌ల పర్యవేక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం 2021 డిసెంబర్ 30న పార్లమెంట్ ద్వారా Dam Safety Act‌ను అమల్లోకి తెచ్చిందని, ఈ చట్టం ప్రకారం ఎన్‌డీఎస్ఏ దేశంలోని అన్ని డ్యామ్‌ల తనిఖీ, పర్యవేక్షణ, నిర్వహణ, మరమ్మతులకు బాధ్యత వహిస్తుందని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. 2023లో మేడిగడ్డ ప్రమాదం జరిగిన వెంటనే ఎన్‌డీఎస్ఏ ప్రాథమిక నివేదిక, అనంతరం పూర్తి స్థాయి నివేదిక ఇచ్చిందని తెలిపారు.

మేడిగడ్డ 7వ బ్లాక్ వద్ద బ్యారేజీ పిల్లర్లు 1.2 మీటర్లు కుంగిపోయాయని, ప్లానింగ్, డిజైన్, నిర్మాణం, నిర్వహణలోపాల వల్లే ఈ ప్రమాదం సంభవించిందని ఎన్‌డీఎస్ఏ 365 పేజీల నివేదికలో స్పష్టంగా పేర్కొన్నదని ఆయన వివరించారు. ఆ నివేదిక ప్రకారం మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు నీటిని నిల్వ చేయడానికి పనికిరావని, మేడిగడ్డ 7వ బ్లాక్ డ్యామేజ్ కారణంగా మొత్తం బ్యారేజీ ప్రభావితమై నీటి నిల్వ సాధ్యం కాదని తేల్చిందని చెప్పారు.