రాయలసీమ న్యూస్, తెలంగాణ డెస్క్: రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలను బావిలోకి తోసి, అనంతరం తల్లి కూడా దూకి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ విషాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం వెల్లడిస్తోంది.
పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా కొడంగల్ ప్రాంతానికి చెందిన వసంత, సుధాకర్ దంపతులు ఉపాధి కోసం కొంతకాలం క్రితం శంకర్‌పల్లి సమీపంలోని కొత్తపల్లి గ్రామానికి వచ్చి అక్కడే స్థిరపడ్డారు. వీరికి పదిహేనేళ్ల కూతురు, పదేళ్ల కుమారుడు ఉన్నారు.
గురువారం రాత్రి దంపతుల మధ్య ఘర్షణ జరిగినట్లు తెలిసింది. ఈ గొడవ అనంతరం మనస్తాపానికి గురైన వసంత, తన కూతురు నవ్య, కుమారుడిని సమీపంలోని బావి వద్దకు తీసుకెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ తర్వాత ఇద్దరు పిల్లలను బావిలోకి తోసి, తానే కూడా దూకినట్లు దర్యాప్తులో బయటపడుతోంది.
ఈ ఘటనలో వసంత, ఆమె కూతురు నవ్య మృతిచెందారు. అయితే పదేళ్ల కుమారుడు బావిలో ఉన్న చెట్టు కొమ్మను పట్టుకుని ప్రాణాలను నిలబెట్టుకున్నాడు. అతడిని స్థానికులు బయటకు తీశారు. బాలుడు ప్రాణాలతో బయటపడటం కొంత ఊరటనిచ్చినా, తల్లి, అక్క మృతిచెందడం కుటుంబంలో, గ్రామంలో విషాదాన్ని నింపింది.
సమాచారం అందిన వెంటనే శంకర్‌పల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బావిలో పడిన మృతదేహాలను వెలికితీశారు. అనంతరం వాటిని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.
గత కొంతకాలంగా వసంత, సుధాకర్ దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. కుటుంబ కలహాలే ఈ దారుణానికి దారితీశాయా, లేక మరే ఇతర కారణాలున్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. దంపతుల మధ్య జరిగిన గొడవల స్వరూపం, ఆర్థిక లేదా ఇతర సమస్యలపై కూడా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
ఈ ఘటనతో కొత్తపల్లి గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. తల్లి, కూతురు మృతిచెందిన ఘటనపై గ్రామస్తులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. బాలుడి భవిష్యత్తు ఏవిధంగా ఉండబోతుందన్న ఆందోళన కూడా స్థానికుల్లో వ్యక్తమవుతోంది.







