హైదరాబాద్‌ నగరంలో పేరొందిన పుల్లారెడ్డి స్వీట్స్ తయారీ కేంద్రంపై ఆహార భద్రతా అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. సనత్‌నగర్‌లో ఉన్న ఈ యూనిట్‌లో పరిశుభ్రతా ప్రమాణాలు తీవ్రంగా ఉల్లంఘించినట్లు తేలడంతో, అక్కడి FSSAI లైసెన్స్‌ను సస్పెండ్ చేసి కార్యకలాపాలను నిలిపివేశారు.

ఎన్నో ఏండ్లుగా వినియోగదారుల నమ్మకాన్ని సొంతం చేసుకున్న పుల్లారెడ్డి స్వీట్స్‌పై వచ్చిన ఈ పరిణామం వినియోగదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఒకప్పుడు లాభాల కంటే నమ్మకానికి ప్రాధాన్యం ఇచ్చిన బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ సంస్థ తయారీ కేంద్రంలో ఇలాంటి పరిస్థితులు బయటపడటం చర్చనీయాంశమైంది.

తెలంగాణ ఫుడ్ సేఫ్టీ కమిషనరేట్ ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ బృందం సనత్‌నగర్ యూనిట్‌పై ఇటీవల దాడులు నిర్వహించింది. ఈ తనిఖీల్లో స్వీట్లు తయారు చేసే కిచెన్ అత్యంత మురికిగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అలాగే ముడిసరుకు నిల్వ గదుల్లో ఎలుకల మలం, విచ్చలవిడిగా తిరిగే పురుగులు, కుళ్లిపోయిన కూరగాయలు కనిపించాయని అధికార వర్గాలు వెల్లడించాయి.

తయారీ కేంద్రంలో నిల్వ ఉంచిన దాదాపు 3,133 కిలోల అనుమానాస్పద ఆహార పదార్థాలను అక్కడికక్కడే స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఇవి వినియోగానికి అనర్హంగా ఉన్న అవకాశముందని, ప్రజారోగ్యానికి ముప్పు వాటిల్లే పరిస్థితి కనిపించడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

సరైన కేటగిరీ కింద FSSAI లైసెన్స్ తీసుకోకపోవడమే కాకుండా, గడువు ముగిసిన పదార్థాలు, తప్పుడు లేబుళ్లతో ఉన్న సరుకును వినియోగిస్తున్నట్లు తనిఖీల్లో బయటపడింది. ఇది ఆహార భద్రతా నిబంధనలకు విరుద్ధమని కమిషనరేట్ స్పష్టం చేసింది.

స్వాధీనం చేసుకున్న పలు స్వీట్ల శాంపిళ్లను ప్రయోగశాలకు పంపించినట్లు అధికారులు తెలిపారు. ల్యాబ్ పరీక్షల ఫలితాల ఆధారంగా సంబంధిత బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఫుడ్ సేఫ్టీ కమిషనరేట్ హెచ్చరించింది.

ఈ ఘటన నేపథ్యంలో వినియోగదారుల ఆరోగ్య భద్రతపై మరింత అప్రమత్తంగా ఉండాలని, ఆహార పదార్థాలు కొనుగోలు చేసే సమయంలో తయారీ, గడువు తేదీలను తప్పనిసరిగా పరిశీలించాలని అధికారులు సూచిస్తున్నారు. నగరంలో ఇతర స్వీట్స్, బేకరీ యూనిట్లపై కూడా తనిఖీలు కొనసాగనున్నట్లు సమాచారం.