ఆఫీస్ నాలుగో అంతస్తు నుంచి దూకిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్

హైదరాబాద్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ ఐటీ సంస్థలో పనిచేస్తున్న ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కార్యాలయ భవనం నాలుగో అంతస్తు నుంచి దూకి మృతి చెందారు. కుటుంబ సభ్యులకు ఇంటికి వస్తానని చెప్పిన కొద్ది గంటల్లోనే రక్తపు మడుగులో కనిపించడం కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసుల కథనం ప్రకారం.. బెంగళూరుకు చెందిన తిరువీధి వి. అవినాశ్ (40) ఉద్యోగరీత్యా రెండు నెలల క్రితం భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి హైదరాబాద్‌కు వచ్చి కూకట్‌పల్లిలో నివాసం ఉంటున్నారు. నగరంలోని నాలెడ్జ్ సిటీలో ఉన్న ఓ ఐటీ సంస్థలో విధులు నిర్వర్తిస్తున్నారు. మంగళవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో కార్యాలయం నుంచి బయలుదేరుతున్నట్లు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.

అయితే రాత్రి వరకు అవినాశ్ ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు కార్యాలయంలో ఆరా తీశారు. అప్పటికే ఆయన వెళ్లిపోయినట్లు సిబ్బంది తెలిపారు. అనంతరం రాత్రి 8.30 గంటల సమయంలో అవినాశ్ బంధువు కార్యాలయం వెనుక ప్రాంతానికి వెళ్లి చూడగా.. రక్తపు మడుగులో ఆయన మృతదేహం కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా.. విధులు ముగిసిన అనంతరం కార్యాలయం నాలుగో అంతస్తులోని ప్లే ఏరియా నుంచి అవినాశ్ కిందికి దూకినట్లు పోలీసులు గుర్తించారు. ఇటీవల సైబర్ నేరగాళ్ల మోసానికి గురై రూ.2 లక్షలు కోల్పోయినట్లు సమాచారం. ఆ ఆర్థిక నష్టం కారణంగా మనస్తాపానికి గురై ఈ ఘటనకు పాల్పడ్డారా? లేక మరేదైనా వ్యక్తిగత కారణాలున్నాయా? అనే అంశాలపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తు పూర్తయ్యాకే వెల్లడికానున్నాయి. ప్రస్తుతానికి కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలు, కుటుంబ సభ్యుల వాంగ్మూలాలను పరిశీలిస్తూ దర్యాప్తును కొనసాగిస్తున్నారు.