ఐటీ కారిడార్‌లో గంజాయి రవాణా.. నీతూబాయి మళ్లీ పరారే

నగర ఐటీ కారిడార్‌లో గంజాయి విక్రయాలతో పోలీసులు, ఎక్సైజ్‌ శాఖ, ప్రత్యేక దళాలకు ముప్పుతిప్పలు పెడుతున్న కాలాపతి నీతూబాయి మరోసారి తప్పించుకుంది. నానక్‌రాంగూడలోని ఆమె నివాసంపై బుధవారం మధ్యాహ్నం తెలంగాణ ఈగల్‌ బృందాలు ఆకస్మిక దాడి జరిపినా.. ఆమె మాత్రం ముందుగానే జాడ మాయంచేసుకుంది. అయితే గంజాయి కొనుగోలుకు వచ్చిన 47 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఆమె ఇంటి నుంచి రూ.2.60 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఈగల్‌ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు.

ధూల్‌పేటకు చెందిన కాలాపతి నీతూబాయి (48) నానక్‌రాంగూడలోని లోథాబస్తీ ప్రాంతాన్ని అడ్డాగా మార్చుకొని గంజాయి వ్యాపారం కొనసాగిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. స్థానికంగా ఓ కిరాణా దుకాణం నడుపుతూ, అదే కవచంగా పదేళ్లుగా కుటుంబ సభ్యుల సహకారంతో పెద్ద ఎత్తున గంజాయి విక్రయాలు సాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఐటీ కారిడార్‌లో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులనే ప్రధాన లక్ష్యంగా చేసుకొని రోజువారీగా లక్షల్లో ఆదాయం ఆర్జిస్తున్నట్లు సమాచారం.

నీతూబాయి‌పై 2017 నుంచి 2024 వరకు మొత్తం 20 కేసులు నమోదయ్యాయి. 2023లో ఆమె అరెస్టయినప్పుడు 16 బ్యాంకు ఖాతాల్లో కలిపి రూ.1.53 కోట్ల నగదు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గంజాయి దందా ద్వారా సొంతం చేసుకున్న సుమారు రూ.2 కోట్ల విలువైన స్థిరాస్తులను ఎన్‌డీపీఎస్‌ చట్టం కింద స్వాధీనం చేసుకున్నారు. చివరిసారిగా 2024 మార్చిలో ఈగల్‌ ఆపరేషన్‌లో పట్టుబడిన ఆమె వద్ద నుంచి రూ.34.40 లక్షల నగదు స్వాధీనం అయ్యింది. అనంతరం పోలీసులు పీడీ యాక్ట్‌ నమోదు చేసి జైలుకు పంపారు.

జైలు నుంచి విడుదలైన తర్వాత నీతూబాయి దాదాపు ఏడాదిగా అజ్ఞాతంలో ఉంటూ మళ్లీ గంజాయి విక్రయాలు ప్రారంభించినట్లు ఈగల్‌ బృందాలకు సమాచారం అందింది. కుటుంబ సభ్యుల సహకారంతో నగరంలోని పలు ప్రాంతాల్లో విక్రయాలు సాగిస్తున్నట్లు కూడా తెలిసింది. ఈ క్రమంలో బుధవారం నానక్‌రాంగూడలోని ఆమె నివాసంపై ఈగల్‌ ఫోర్స్‌ బృందాలు ప్రత్యేక ఆపరేషన్‌ నిర్వహించాయి.

దాడి సమయంలో అక్కడికి గంజాయి కొనుగోలుకు వచ్చిన 47 మందిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. అయితే ఈగల్‌ బృందాల రాకను ముందుగానే పసిగట్టిన నీతూబాయి చాకచక్యంగా అక్కడి నుంచి పరారైనట్లు అధికారులు తెలిపారు. ఆమె కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలను కొనసాగిస్తున్నాయి. పట్టుబడిన కొనుగోలుదారుల నుంచి లభించిన సమాచారం, స్వాధీనం చేసుకున్న నగదు ఆధారంగా గంజాయి సరఫరా నెట్‌వర్క్‌ను పూర్తిగా ఛేదించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.