రాయలసీమ న్యూస్, ఆంధ్రప్రదేశ్ డెస్క్: గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపరచడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా తూర్పుగోదావరి జిల్లాకు మంజూరైన రూ.1.40 కోట్ల విలువైన 44 ఈ-ఆటోలను సంబంధిత గ్రామ పంచాయతీలకు పంపిణీ చేశారు. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కొవ్వూరు ఎమ్మెల్యే శ్రీ ముప్పిడి వెంకటేశ్వరరావు, రాజానగరం ఎమ్మెల్యే శ్రీ బత్తుల బలరామకృష్ణ జిల్లా అధికారులతో కలిసి ఈ వాహనాలను గ్రామ పంచాయతీలకు అందజేసి సేవలను ప్రారంభించారు.
జిల్లాలోని 11 మండలాల పరిధిలో 37 గ్రామ పంచాయతీలకు ఈ-ఆటోలు సేవలందించనున్నాయి. నియోజకవర్గాల వారీగా రాజమహేంద్రవరం రూరల్‌కు 12, రాజానగరానికి 7, మండపేటకు 4, కొవ్వూరుకు 9, నిడదవోలుకు 8, గోపాలపురానికి 4 ఈ-ఆటోలను కేటాయించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఘన వ్యర్థాల నిర్వహణను వ్యవస్థీకృతంగా అమలు చేయడంలో ఈ వాహనాలు కీలక పాత్ర పోషించనున్నాయని అధికారులు పేర్కొన్నారు.
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ‘స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమం రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, పట్టణాల్లో చురుగ్గా కొనసాగుతోంది. ఈ కార్యక్రమం భాగంగా తూర్పుగోదావరి జిల్లాకు ఈ-ఆటోలు కేటాయించడం ద్వారా పారిశుధ్య సేవలను మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు పర్యావరణహిత ఈ-ఆటోలు దోహదపడతాయని అధికారులు తెలిపారు. తడి, పొడి, హానికర వ్యర్థాలను వేర్వేరుగా సేకరించేందుకు ఈ-ఆటోల్లో ప్రత్యేక డబ్బాలను ఏర్పాటు చేశారు. దీంతో ఘన వ్యర్థాల వర్గీకరణ, రవాణా, నిర్వహణ ప్రక్రియలను సులభతరం చేయడంతో పాటు పర్యావరణంపై ప్రతికూల ప్రభావాన్ని తగ్గించే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఈ-ఆటోల నిరంతర నిర్వహణకు అవసరమైన చర్యలను ఇప్పటికే ప్రణాళికాబద్ధంగా రూపొందించినట్లు సంబంధిత శాఖ అధికారులు తెలిపారు. సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు సత్వర పరిష్కారానికి అవసరమైన అన్ని చర్యలను కూటమి ప్రభుత్వం చేపడుతుందని స్పష్టం చేశారు. గ్రామీణ పారిశుధ్యాన్ని మెరుగుపరచడంలో ఈ చర్యలు కీలక మైలురాయిగా నిలుస్తాయని జిల్లా అధికార వర్గాలు అభిప్రాయపడ్డాయి.













