రాయలసీమ న్యూస్, హెల్త్ డెస్క్:
భారత్‌లో తగ్గుతున్న సంతానోత్పత్తి రేటు..
యువ దేశానికి వృద్ధాప్య ముప్పు?
భారత్ ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా కలిగిన దేశంగా పేరుగాంచింది. స్వామి వివేకానంద యువతపై ఉంచిన నమ్మకం, వారి పౌరుషం, ధైర్యసాహసాల గురించి తరచూ ప్రస్తావించబడుతుంది. అలాంటి యువ దేశంగా పేరున్న భారత్‌కు ఇప్పుడు సంతానోత్పత్తి రేటు తగ్గుదల రూపంలో కొత్త సవాలు ఎదురవుతోంది. ఈ ధోరణి కొనసాగితే, భారత్ కూడా భవిష్యత్తులో జపాన్, సౌత్ కొరియా లాంటి వృద్ధాప్య జనాభా అధిక దేశాల సరసన చేరే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇటీవల టెస్లా అధినేత ఎలోన్ మస్క్ చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ ఈ చర్చను మరింత వేడెక్కించింది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారత్‌లో ఫెర్టిలిటీ రేట్ వేగంగా పడిపోతోందని ది ఎకనామిస్ట్ ప్రచురించిన కథనాన్ని మస్క్ పంచుకోవడంతో, ముఖ్యంగా విద్యావంతులలో సంతానోత్పత్తి రేటు గణనీయంగా తగ్గిపోయిందనే అంశం హాట్ టాపిక్‌గా మారింది.
యునైటెడ్ నేషన్స్ పొపులతిఒన్ ఫండ్ 2025 నివేదిక ప్రకారం భారత్ టోటల్ ఫెర్టిలిటీ రేట్ (TFR) ప్రస్తుతం 1.9కి పడిపోయింది. అంటే సగటున ఒక భారతీయ మహిళ తన జీవితకాలంలో దాదాపు ఒక్క బిడ్డకే జన్మనివ్వడానికే మొగ్గు చూపుతున్నట్లు అర్థం. ఒక తరం స్థానంలో మరో తరం సమానంగా రావాలంటే ఈ రేటు 2.1 ఉండాలి. దీనినే రీప్లేస్మెంట్ లెవెల్ అంటారు. 1950లలో 5.7గా ఉన్న ఈ రేటు, 2019-21 నాటికి 2.0కి, ఇప్పుడు 1.9కి పడిపోవడం భారత్ భవిష్యత్తుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.
పిల్లల సంఖ్య తగ్గడానికి పెరుగుతున్న జీవన వ్యయాలే ప్రధాన కారణమని కొందరు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. పట్టణాల్లో మధ్యతరగతి, ఉద్యోగ వర్గాలపై గృహనిర్మాణం, నాణ్యమైన ప్రైవేట్ విద్య, వైద్యం, కోచింగ్ క్లాస్స్, ఇతర సౌకర్యాల ఖర్చులు విపరీతంగా పెరిగాయి. పిల్లలకు మంచి జీవితం ఇవ్వాలనే తల్లిదండ్రుల ఆకాంక్షలు ఈ భారాన్ని మరింత పెంచుతున్నాయి.
అయితే ప్రైమ్ మినిస్టర్ ఎకనామిక్ అడ్విసోరీ కౌన్సిల్ సభ్యురాలు శామిక రవి మాత్రం భిన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆమె విశ్లేషణ ప్రకారం, సంతానోత్పత్తి తగ్గడానికి కేవలం ఆర్థిక కారణాలే కాదు, ప్రజల్లో “పిల్లలు కావాలి” అనే కోరిక తగ్గిపోవడమే అసలు సమస్య. ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశాలైన జపాన్, సౌత్ కొరియా లలో ప్రభుత్వాలు భారీ ఆర్థిక ప్రోత్సాహకాలు ఇస్తున్నప్పటికీ, అక్కడ కూడా జననాల రేటు పెరగడం లేదని ఆమె గుర్తుచేశారు. భారత పట్టణాల్లో గత 25 ఏళ్లుగా TFR రీప్లేస్మెంట్ లెవెల్ కంటే తక్కువగా ఉందని, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇదే ధోరణి కనిపిస్తోందని ఆమె విశ్లేషించారు. ఇది సమాజంలో జరుగుతున్న లోతైన సాంస్కృతిక మార్పులకు ప్రతిబింబమని, కేవలం ఆర్థిక ప్రోత్సాహకాలతో ఈ ఆలోచన మారదని ఆమె అభిప్రాయపడుతున్నారు.
నోబెల్ గ్రహీత అమర్త్య సేన్ తన “ డెవలప్మెంట్ అస్ ఫ్రీడమ్” పుస్తకంలో మహిళల అభివృద్ధి, సంతానోత్పత్తి తగ్గుదల మధ్య ఉన్న ప్రత్యక్ష సంబంధాన్ని వివరించారు. మహిళల్లో విద్యావంతుల సంఖ్య పెరగడం, కెరీర్‌పై దృష్టి పెట్టడం, ఆలస్యంగా వివాహాలు చేసుకోవడం, తమ జీవితాలపై స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడం వంటి అంశాలు ఫెర్టిలిటీ రేట్ తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. 2025లో జర్నల్ అఫ్ పోపుపోపులోషన్ రీసెర్చ్ లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, మహిళలకు మీడియా ఎక్సపోసుర్ , ఆర్థిక స్వాతంత్ర్యం, ఆస్తి హక్కులు ఉన్నచోట సంతానోత్పత్తి రేటు తక్కువగా, పురుషాధిక్యత ఎక్కువగా ఉన్నచోట పిల్లల సంఖ్య ఎక్కువగా ఉంది.
fintech నిపుణురాలు మోనికా హలం అభిప్రాయం ప్రకారం, ఆధునిక విద్యావంతులు పిల్లల్ని కనడాన్ని బాధ్యతగా కాకుండా వ్యక్తిగత ఎంపికగా చూస్తున్నారు. సమయం కొరత, కెరీర్ ఒత్తిళ్ల కారణంగా చాలామంది “ DINK” (Double Income, No Kids) సంస్కృతి వైపు మొగ్గు చూపుతున్నారు. అదనంగా, మదర్ హుడ్ పెనాల్టీ వల్ల మహిళల కెరీర్ దెబ్బతినడం, గృహ పనులు, పిల్లల పెంపకం బాధ్యతలు ఎక్కువగా మహిళలపైనే పడటం కూడా రెండో బిడ్డకు, కొన్నిసార్లు పిల్లలకే దూరంగా ఉండే నిర్ణయాలకు దారితీస్తోంది.
భారత్‌లో ఫెర్టిలిటీ రేట్ తగ్గుదల అన్ని ప్రాంతాల్లో ఒకేలా లేదు. స్పష్టమైన ఉత్తర–దక్షిణ, పట్టణ–గ్రామీణ వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. కేరళ, తమిళనాడు , కర్ణాటక , తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ వంటి దక్షిణాది రాష్ట్రాల్లో విద్య, వైద్యం, మహిళా సాధికారత మెరుగ్గా ఉండటంతో ఫెర్టిలిటీ రేట్ వేగంగా పడిపోయింది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు వంటి దక్షిణాది ముఖ్యమంత్రులు జనాభా పెంపు, ఎక్కువ మంది పిల్లల్ని కనాలని పిలుపునిస్తున్నారు. మరోవైపు బీహార్ (2.9 TFR), ఉత్తర్ ప్రదేశ్ (2.6), మధ్య ప్రదేశ్(2.4), రాజస్థాన్ (2.3) వంటి ఉత్తరాది రాష్ట్రాలు ఇప్పటికీ రీప్లేస్మెంట్ లెవెల్ కంటే పైనే ఉన్నాయి.
పట్టణ ప్రాంతాల్లో TFR 1.5కి పడిపోగా, ఢిల్లీ లో అత్యల్పంగా 1.2, చండీగఢ్ లో 1.4గా నమోదైంది. అయితే ఈ పరిణామాల వల్ల భారత్‌కు తక్షణ ప్రమాదం లేదని ఎకనామిక్ అడ్విసోరీ కౌన్సిల్ సభ్యుడు సంజీవ్ సన్యాల్ అభిప్రాయపడుతున్నారు. భారతదేశంలో లైవ్ బిర్త్స్ గరిష్ట స్థాయి 2001లోనే దాటిపోయిందని, ప్రస్తుతం జనాభా పెరుగుతున్నట్లు కనిపించడం ఆయుర్దాయం పెరగడమే కారణమని ఆయన సూచించారు. లేదంటే 2030ల నాటికే జనాభా తగ్గుదల స్పష్టంగా కనిపించేదని ఆయన విశ్లేషించారు.
నిపుణుల అంచనాల ప్రకారం 2050 నాటికి దేశంలో 60 ఏళ్లు పైబడిన వారి సంఖ్య 20 శాతానికి, అంటే దాదాపు 30 కోట్లకు చేరే అవకాశం ఉంది. దీంతో భారత్ సంపన్న దేశంగా మారకముందే వృద్ధాప్య దేశంగా మారిపోయే ప్రమాదం ఉందని హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జపాన్ తరహాలో వృద్ధులను కూడా ఉత్పాదక శ్రమలో భాగస్వామ్యం చేసే “ సిల్వర్ డివిడెండ్ ” విధానాలను ఇప్పటి నుంచే ఆచరణలోకి తేవాలని నిపుణులు సూచిస్తున్నారు.
మొత్తం మీద, భారత్‌లో తగ్గుతున్న జననాల రేటుకు ఒక్క కారణం కాదు. పెరుగుతున్న జీవన వ్యయాలు, మారుతున్న సామాజిక ఆకాంక్షలు, మహిళల సాధికారత, కెరీర్ ప్రాధాన్యతలు, కుటుంబ నిర్మాణంలో వస్తున్న మార్పులు అన్నీ కలిసి ఈ ధోరణిని ముందుకు నెడుతున్నాయి. యువ దేశంగా ఉన్న భారత్ భవిష్యత్తు సమతుల్యంగా ఉండాలంటే, ఈ సవాలును సమయానికి గుర్తించి తగిన విధానాలు రూపొందించడం అత్యవసరం అని నిపుణులు సూచిస్తున్నారు.













