అనంతపురం:- పంట ఏదైనా దుక్కి నుంచి మార్కెట్‌ వరకూ రైతు పడే శ్రమ అమోఘం. అప్పులు చేసి పెట్టుబడి పెడతాడు. విత్తనాలు, ఎరువులు, మందులు, కూలీలకు భారీగా ఖర్చు చేస్తాడు. నెలల తరబడి కష్టపడి పండించిన పంటను మార్కెట్‌కు తీసుకెళ్లే సమయానికి మాత్రం వ్యాపారుల మాయాజాలం మొదలవుతోంది. పైసా పెట్టుబడి లేకుండానే కమీషన్లు, తరుగు పేరుతో రైతులను నిలువునా దోచుకుంటున్నారు. ఇందుకోసం సిండికేట్‌లు ఏర్పాటు చేసుకోవడానికీ వెనుకాడడం లేదు.

ఉమ్మడి అనంతపురం జిల్లాలో మామిడి పంటపై ఈ దోపిడీ మరింత ఎక్కువగా కనిపిస్తోంది. రైతు పంటకు గిట్టుబాటు ధర రాకుండా అడ్డంకులు సృష్టించడం, కృత్రిమంగా ధరలు తగ్గించడం, తరుగు, కమీషన్‌ పేర్లతో కోట్ల రూపాయలు వసూలు చేయడం సాధారణంగా మారింది. ఏళ్లుగా కొనసాగుతున్న ఈ తతంగానికి కూటమి ప్రభుత్వం అడ్డుకట్ట వేస్తుందనే ఆశతో ఉన్న రైతులకు ఇప్పటికీ ఉపశమనం కనిపించడం లేదు.

ఉమ్మడి అనంతపురం జిల్లాలో పండిన మామిడిని బెంగళూరు, హైదరాబాద్, తమిళనాడు, దిల్లీ, కోల్‌కతా, కేరళ వంటి రాష్ట్రాలకు భారీగా ఎగుమతి చేస్తున్నారు. జిల్లాలో నుంచి సుమారు వెయ్యి టన్నుల వరకు మామిడి కాయలను కోసి వివిధ మార్కెట్లకు పంపుతున్నారు. టన్నుకు 50 కిలోల చొప్పున తరుగు పేరిట పట్టుకుంటున్నారు. అలాగే ప్రతి లక్ష రూపాయల అమ్మకానికి 10 వేల రూపాయల చొప్పున కమీషన్‌ దండుకుంటున్నారు.

ఈ లెక్కన తరుగు పేరుతో ఏడాదికి సుమారు 7 వేల టన్నుల మామిడిపై రూ.17.50 కోట్లు, 10 శాతం కమీషన్‌ పేరుతో మరో రూ.28 కోట్లు వసూలు చేస్తున్నట్లు రైతు సంఘాలు అంచనా వేస్తున్నాయి. మొత్తంగా ఏటా రూ.37.50 కోట్లు కమీషన్‌, తరుగు పేర్లతో వ్యాపారుల జేబుల్లోకి వెళ్తున్నాయని స్థానిక వ్యవసాయ వర్గాలు చెబుతున్నాయి. పంట ఉత్పత్తులపై ఎలాంటి తరుగు లేకుండా కేవలం 4 శాతం కమీషన్‌ మాత్రమే వసూలు చేయాలనే నిబంధన ఉన్నప్పటికీ, అమలు కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

శెట్టూరు మండలంలోని కళ్యాణదుర్గం సమీపానికి చెందిన కౌలురైతు హనుమంతు పరిస్థితి ఈ దోపిడీ తీవ్రతను ప్రతిబింబిస్తోంది. ఆయన పదెకరాల మామిడి తోటను రూ.5.30 లక్షలకు కౌలుకు తీసుకున్నారు. ఎకరాకు 2 టన్నుల చొప్పున మొత్తం 22 టన్నుల దిగుబడి వచ్చింది. టన్నుకు రూ.25 వేల చొప్పున అమ్మకానికి పెట్టగా, మొత్తం రూ.5.50 లక్షలు వచ్చాయి. మందులకు రూ.1.75 లక్షలు, కూలీలు, బుట్టలు, లారీ బాడుగలకు రూ.50 వేల రూపాయలు ఖర్చయ్యాయి. టన్నుకాయలపై తరుగు పేరుతో మామిడి కాయలను పట్టుకున్నారు. కమీషన్‌గా రూ.55 వేల రూపాయలు తీసుకున్నారు. మొత్తం రూ.3.05 లక్షల ఖర్చులు పోను, చేతిలో మిగిలిన రూ.2.85 లక్షలతో కౌలు మొత్తాన్ని చెల్లించాల్సి వచ్చిందని ఆయన వివరించారు.

ఉమ్మడి అనంతపురం జిల్లాలో బేనీషా, మల్లికా, తోతాపురి, నీలిమా, హిమాయత్తు వంటి మామిడి రకాలు విస్తారంగా సాగు చేస్తున్నారు. మొత్తం 85 వేల ఎకరాల్లో మామిడి తోటలు ఉండగా, అందులో 70 వేల ఎకరాల్లో పంట కోతకు వచ్చింది. ఎకరాకు సగటున 2 టన్నుల చొప్పున మొత్తం 1.40 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. టన్నుకు సరాసరి రూ.20 వేల చొప్పున లెక్కిస్తే, మామిడి పంట ద్వారా సుమారు రూ.280 కోట్ల ఆదాయం రావాల్సి ఉంది. అయితే తరుగు, కమీషన్‌ పేర్లతో కోట్ల రూపాయలు మధ్యలోనే ఆగిపోవడంతో రైతుల కష్టానికి తగిన ఫలితం దక్కడం లేదని వారు వాపోతున్నారు.