రాయలసీమ న్యూస్, మూవీ రివ్యూస్ డెస్క్: టాలీవుడ్‌లో మాస్ ఇమేజ్‌కు పేరుగాంచిన హీరో రామ్‌చరణ్ తాజాగా పూర్తిగా భిన్నమైన పాత్రలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ‘పెద్ది’ చిత్రంలో ఆయన నటన, పాత్ర ఎంపిక సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా, జగపతిబాబు, శివరాజ్‌కుమార్ కీలక పాత్రలు పోషించారు. దాదాపు 350 కోట్ల భారీ బడ్జెట్‌తో వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మించారు.
సోలో హీరోగా రామ్‌చరణ్‌కు గణనీయమైన విజయం దక్కి ఎనిమిదేళ్లు దాటిపోయింది. కమర్షియల్ ఫార్ములాతో వచ్చిన ‘గేమ్ ఛేంజర్’తో పాటు ఇటీవలి చిత్రాలు ఆశించిన స్థాయిలో నిలవలేదు. ఈ నేపథ్యంలో తన మాస్ ఇమేజ్‌ను పక్కన పెట్టి చేసిన చిత్రం ‘పెద్ది’. ఈ ఏడాది టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తికరంగా ఎదురు చూసిన చిత్రాల్లో ఒకటైన ఈ సినిమా జూన్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
కథ పరంగా ‘పెద్ది’ గ్రామీణ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామా. పెద్ది పాత్రలో రామ్‌చరణ్ ఓ క్రికెటర్‌గా కనిపిస్తారు. బతుకుతెరువు కోసం బెల్లం తయారు చేసే ఫ్యాక్టరీలో పనిచేసే అతని గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం, ఓటు హక్కు వంటి ప్రాథమిక హక్కులు కూడా లేవు. గ్రామం మీదుగా రైల్వే ట్రాక్ ఉన్నా, స్టేషన్ లేకపోవడంతో ఒక్క రైలు కూడా ఆగదు. గ్రామానికి రైల్వే స్టేషన్ రావాలనే లక్ష్యంతో అప్పలసూరి (జగపతిబాబు) పోరాటం చేస్తుంటాడు.
విజయనగరం, బొబ్బిలి ప్రాంతాల్లో పెద్ది క్రికెటర్‌గా పేరు తెచ్చుకుంటాడు. అయితే అప్పలసూరి మరణం అతని జీవితాన్ని మలుపుతిప్పుతుంది. క్రికెట్‌ను వదిలి కుస్తీని ఎంచుకునే నిర్ణయం తీసుకుంటాడు. అప్పలసూరి మరణానికి గల కారణం ఏమిటి, గ్రామానికి, దేశానికి గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో పెద్ది ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకున్నాడు, కుస్తీ ఫైనల్ వరకు వెళ్లిన అతను చివరికి ఆటకు దూరం కావాల్సిన పరిస్థితి ఎలా వచ్చిందనే అంశాల చుట్టూ కథ తిరుగుతుంది. అచ్చియమ్మ (జాన్వీ కపూర్)తో ప్రేమ, గౌర్నాయుడు (శివరాజ్‌కుమార్) పాత్ర, రాంబుజ్జి (దివ్యేందు శర్మ), వీరభద్రం (తారక్ పొన్నప్ప)లతో పెద్ది మధ్య జరిగే ఘర్షణలు కథలో కీలకంగా నిలుస్తాయి.
నటీనటుల పరంగా చూస్తే ‘పెద్ది’ పూర్తిగా రామ్‌చరణ్ వన్ మాన్ షోగా నిలిచింది. ఆయన కెరీర్‌లోనే ఉత్తమ నటనగా ఈ చిత్రాన్ని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. క్రికెట్, రెజ్లింగ్ సన్నివేశాల కోసం ఆయన చేసిన కష్టపాటు తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. క్లైమాక్స్‌లో భావోద్వేగ నటనతో ఆకట్టుకున్నారు. హీరోయిజం హంగులు తగ్గించిన క్లైమాక్స్‌ను అంగీకరించడం స్టార్ హీరోగా ఆయన తీసుకున్న ధైర్య నిర్ణయంగా భావిస్తున్నారు.
అప్పలసూరి పాత్రలో జగపతిబాబు నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. స్టైలిష్ ఇమేజ్‌కు భిన్నంగా ఆయన కనిపించారు. గురువు పాత్రలో శివరాజ్‌కుమార్ హుందాతనాన్ని తెరపై చూపించారు. జాన్వీ కపూర్ పాత్రకు నటన పరంగా అంత బలం లేకపోయినా, గ్లామర్ కోణంలోనే ఎక్కువగా వినియోగించినట్లు కనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్‌లో ఆమెకు ఎక్కువ స్క్రీన్ స్పేస్ లభించగా, సెకండ్ హాఫ్‌లో ప్రాధాన్యం తగ్గింది. స్పెషల్ సాంగ్‌లో శృతి హాసన్ ప్రభావం చూపలేకపోయింది. దివ్యేందు శర్మ, తారక్ పొన్నప్ప, అజయ్ ఘోష్, ఉపేంద్ర లిమాయే వంటి ప్రతిభావంతులైన నటులను దర్శకుడు పూర్తిగా వినియోగించలేదని విమర్శలు వినిపిస్తున్నాయి.
సాంకేతికంగా ‘పెద్ది’ బలంగా నిలిచింది. దర్శకుడు, రచయితగా బుచ్చిబాబు సానా తన కథను నిజాయితీగా తెరపై ఆవిష్కరించారు. రామ్‌చరణ్ వంటి స్టార్ హీరోను ఎలా హ్యాండిల్ చేస్తాడోనన్న అభిమానుల సందేహాలకు సమాధానం ఇస్తూ, ఫ్యాన్స్ కోరుకునే ఎలివేషన్లు, కమర్షియల్ అంశాలను మిస్ కాకుండా, తన కథను కూడా నెమ్మదించకుండా చెప్పగలిగారు.
సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి మరో హీరోలా నిలిచారు. ‘రై రై’, ‘చికిరి’ పాటలు, నేపథ్య సంగీతం చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా మారాయి. సినిమాటోగ్రాఫర్ రత్నవేలు పని చిత్రానికి పెద్ద ప్లస్ పాయింట్. క్రికెట్, కుస్తీ సన్నివేశాలను నిజ జీవితంలో చూస్తున్న అనుభూతి కలిగించారు. ఎడిటర్ నవీన్ నూలి కత్తెరకు మరింత పదును పెట్టి ఉంటే రన్‌టైమ్ మరింత కుదించి ఉండేవారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిర్మాత వెంకట సతీష్ కిలారు నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా, అవసరానికి మించి ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది.
కథా నిర్మాణం పరంగా చూస్తే, గ్రామం, దేశం కోసం పోరాడే ఆటగాడి ప్రయాణాన్ని బుచ్చిబాబు సానా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో చూపించారు. సాధారణంగా ఈ జానర్ చిత్రాల్లో లాజిక్ కంటే హీరో విజయానికే ప్రాధాన్యం ఇస్తారు. అయితే ‘పెద్ది’లో రియలిస్టిక్ టచ్ ఇవ్వడానికి ప్రయత్నించారు. క్రికెట్, రెజ్లింగ్‌తో పాటు రన్నింగ్ గేమ్‌ను కూడా చూపించడం విశేషం. ఈ గేమ్స్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ఫ్యాన్స్‌కు మంచి కిక్ ఇస్తాయి. ముఖ్యంగా రెజ్లింగ్ ఎపిసోడ్‌లో రామ్‌చరణ్ హీరోయిజాన్ని పీక్స్‌లో చూపించారు. ఇద్దరు రెజ్లర్లతో ఒకేసారి పోరాడే యాక్షన్ బ్లాక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
చిత్రబృందం ప్రచార కార్యక్రమాల్లో క్లైమాక్స్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు సమాచారం. పతాక ఘట్టాలను భావోద్వేగంగా రాసిన తీరు విశ్లేషకుల ప్రశంసలు అందుకుంది. ఇటీవలి కాలంలో వచ్చిన చిత్రాల్లో ఇది ఉత్తమ క్లైమాక్స్‌లలో ఒకటిగా పేర్కొంటున్నారు. అయితే ఫస్ట్ హాఫ్ చిత్రానికి మైనస్‌గా మారిందని సమీక్షలు సూచిస్తున్నాయి. క్రికెటర్‌గా పెద్ది మ్యాజిక్, అచ్చియమ్మ తండ్రిని ఎన్నికల్లో గెలిపించేందుకు చేసే ప్రయత్నాలు కథను బలపరచలేకపోయాయి. ఈ సన్నివేశాలు కథకు పెద్దగా సంబంధం లేకుండా టైమ్‌పాస్‌లా సాగుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పెద్ది–అచ్చియమ్మ ప్రేమకథలో ఆకర్షణీయమైన మాధుర్యం, క్యూట్‌నెస్ రెండూ తగ్గాయని, లవ్ ట్రాక్‌ను బలవంతంగా ఇరికించిన భావన కలుగుతోందని విమర్శకులు చెబుతున్నారు. అప్పలసూరి మరణం, రైల్వే పోలీసులతో పెద్ది ఘర్షణ తర్వాత కథ సరైన ట్రాక్‌లో పడినట్లు అనిపిస్తుంది. రెజ్లింగ్ సన్నివేశాలు బాగా వచ్చినప్పటికీ, కొంత సాగదీసిన భావన కలుగుతుంది. ఢిల్లీ ఎపిసోడ్‌లో ఆసక్తి తగ్గినట్లు కనిపిస్తుంది. హీరో తన లక్ష్యాన్ని ఎలా చేరుకుంటాడన్న విషయంలో ఆశ్చర్యపరిచే మలుపులు లేకపోవడం గమనార్హం.
రేటింగ్: 3/5 ( రివ్యూవర్ అభిప్రాయం మాత్రమే)













