పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి నగరపాలక సంస్థ తీసుకున్న నిర్ణయాలతో రెండేళ్లుగా కొనసాగుతున్న నిరీక్షణకు తెరపడింది. గత రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న వ్యక్తిగత పరిశుభ్రత సామగ్రి పంపిణీ, వేతన ఖాతాల మార్పు, ప్రమాద బీమా సౌకర్యం వంటి అంశాల్లో పురోగతి సాధించినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు.

శుక్రవారం సి. క్యాంపులోని 9వ శానిటేషన్ డివిజన్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు సబ్బులు, ఆయిల్‌ల పంపిణీ కార్యక్రమాన్ని కమిషనర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంతో రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న సబ్బులు, ఆయిల్‌ల పంపిణీ పూర్తి అయినట్లు ఆయన వెల్లడించారు. మొత్తం 1,055 మంది కార్మికుల సంక్షేమార్థం గత రెండేళ్లకు సంబంధించిన సబ్బులు, ఆయిల్‌ల కొనుగోలుకు రూ.72 లక్షలు వ్యయం చేసినట్లు వివరించారు.

ఈ సందర్భంగా కమిషనర్ చల్లా ఓబులేసు మాట్లాడుతూ నగర పరిశుభ్రత, ప్రజల ఆరోగ్య పరిరక్షణలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు కీలకమని, వారి సంక్షేమానికి నగరపాలక సంస్థ అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. నగరాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా ఉంచడంలో వారి పాత్ర ఎంత ముఖ్యమో, వారి ఆరోగ్య భద్రత కూడా అంతే ప్రాధాన్యమని ఆయన తెలిపారు.

గత రెండేళ్లుగా కార్మికులకు అందాల్సిన సబ్బులు, ఆయిల్, రెయిన్‌కోట్లు, గ్లౌజులు, ఏప్రాన్లు, యూనిఫాంలు, టవల్స్, చెప్పులు, చీరలు పంపిణీ పెండింగ్‌లో ఉన్న విషయం తన దృష్టికి వచ్చిన వెంటనే సంబంధిత అధికారులను చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు కమిషనర్ వివరించారు. ఇప్పటికే సబ్బులు, ఆయిల్ మినహా మిగిలిన అన్ని సంక్షేమ సామగ్రిని కార్మికులకు పంపిణీ చేశామని, ఇప్పుడు సబ్బులు, ఆయిల్‌ల పంపిణీతో రెండేళ్ల పెండింగ్ పూర్తిగా క్లియర్ అయినట్లు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వ్యక్తిగత పరిశుభ్రత కిట్లను కూడా త్వరలోనే కార్మికులకు అందజేయనున్నట్లు వెల్లడించారు.

అదనంగా పారిశుద్ధ్య పనితీరు మరింత సమర్థవంతంగా ఉండేలా సుమారు రూ.1.50 కోట్లు వ్యయంతో 4 వేల చెత్త బిన్లు, 88 వీల్‌బారోలు, బొంగు రేకులు, సలికలు, పారలు తదితర పారిశుద్ధ్య పనిముట్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కమిషనర్ తెలిపారు. వీటి ద్వారా ఫీల్డ్‌లో పనిచేస్తున్న కార్మికులకు అవసరమైన పరికరాల కొరత ఉండకుండా చూసినట్లు పేర్కొన్నారు.

మరోవైపు విధి నిర్వహణలో ఉన్న సమయంలో ఉద్యోగులు ప్రమాదాలకు గురైన సందర్భంలో వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో యాక్సిస్ బ్యాంకు ద్వారా లభించే ప్రమాద బీమా ప్రయోజనాలను వేలాదిమంది రెగ్యులర్, ఆప్కాస్ ఉద్యోగులు పొందేలా చర్యలు తీసుకున్నట్లు కమిషనర్ తెలిపారు. ఏడాదికాలంగా పెండింగ్‌లో ఉన్న వేతన ఖాతాల మార్పు ప్రక్రియను పూర్తి చేసి, ఆప్కాస్ ఉద్యోగులతో పాటు నగరపాలక సంస్థలో పనిచేస్తున్న అర్హులైన ఉద్యోగులందరి వేతన ఖాతాలను యాక్సిస్ బ్యాంకుకు మార్చినట్లు ఆయన వివరించారు.