రాయలసీమ న్యూస్, తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గకపోయినా, భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ప్రత్యేక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఆక్టోపస్ భద్రతా దళాలు అర్ధరాత్రి భారీ మాక్ డ్రిల్ నిర్వహించాయి. తిరుమల వెంకటాద్రి నిలయం పరిధిలోని PAC 5 ఏరియాలో ఈ విన్యాసాలు జరగడంతో కొంతసేపు భక్తుల్లో ఉత్కంఠ నెలకొంది.
వైకుంఠంలోని అన్ని కంపార్ట్‌మెంట్లలో భక్తులు క్యూ లైన్లలో వేచి ఉండగా, సర్వదర్శనానికి సుమారు 10 గంటలు, SSD దర్శనానికి 8 గంటలు, ప్రత్యేక దర్శనానికి 5 గంటల వరకు సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో ఏవైనా అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు వెంటనే స్పందించేందుకు భద్రతా బలగాల సిద్ధతను పరీక్షించడమే ఈ మాక్ డ్రిల్ లక్ష్యంగా అధికారులు పేర్కొన్నారు.
అర్ధరాత్రి సమయంలో PAC 5 ప్రాంతంలో ఒకేసారి సుమారు 50 మంది ఆక్టోపస్ సిబ్బంది గన్స్‌తో ప్రవేశించి ఆపరేషన్ నిర్వహించారు. ఉగ్రవాదులుగా భావించిన కొందరిని అదుపులోకి తీసుకున్నట్లుగా చూపిస్తూ, వారి చేతులు, కాళ్లు కట్టేసి బంధీలను ఎలా రక్షించాలి, ఎలా బయటకు తీసుకురావాలి అనే అంశాలపై ప్రాక్టీస్ చేశారు. ఈ సందర్భంగా బలగాల కదలికలు, స్పందన వేగం, సమన్వయంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు సమాచారం.
ఏదైనా ఉగ్రవాదులు కొండపైకి చొరబడిన పరిస్థితిలో భద్రతా బలగాలు ఎలా స్పందించాలి, ప్రజలను ఎలా కాపాడాలి, ఎమర్జెన్సీ సమయంలో ఏ విధంగా వ్యవహరించాలి అనే అంశాలపై ఈ డ్రిల్‌ను రూపొందించినట్లు అధికారులు తెలిపారు. ఘటన జరిగినట్లు భావించిన ప్రాంతానికి తిరుమల భద్రతా అంబులెన్స్, ఫైర్ ఇంజన్ వాహనాలు కూడా చేరుకున్నాయి. అకస్మాత్తుగా భారీగా బలగాలు, వాహనాలు కదలికలు ప్రారంభించడంతో అక్కడున్న భక్తులకు ఏమి జరుగుతోందో మొదట్లో అర్థం కాక ఆసక్తిగా గమనించారు.
ఈ విన్యాసాల ద్వారా తిరుమల భద్రతా సిబ్బంది అప్రమత్తత, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పరీక్షించినట్లు టిటిడి వర్గాలు వెల్లడించాయి. భక్తుల భద్రతే తమకు ప్రాధాన్యమని, అందుకే ఇలాంటి మాక్ డ్రిల్లులు నిర్వహిస్తున్నామని టిటిడి అధికారులు స్పష్టం చేశారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమలలో ప్రతిరోజూ వేలాది మంది భక్తులు శ్రీవారి దర్శనం కోసం కొండపైకి వస్తుండటంతో భద్రతా ఏర్పాట్లను నిరంతరం సమీక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ యథావిధిగా కొనసాగుతోంది. సర్వదర్శనానికి 10 గంటలు, SSD దర్శనానికి 8 గంటలు, ప్రత్యేక దర్శనానికి 5 గంటల వరకు వేచి చూడాల్సి వస్తోంది. కేవలం ఒక్కరోజులోనే 84,235 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. వారిలో 29 వేల మందికి పైగా తలనీలాలు సమర్పించారు. నిన్న ఒక్కరోజే హుండీ ద్వారా రూ. 5.18 కోట్ల ఆదాయం వచ్చినట్లు టిటిడి వెల్లడించింది.













