రాయలసీమ న్యూస్, డిస్ట్రిక్ట్ న్యూస్ డెస్క్:
పుల్లంపేట వద్ద రోడ్డుప్రమాదం
ఇద్దరి మృతి, 15మందికి గాయాలు..
తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. పుల్లంపేట వద్ద కడప డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొని ఇద్దరు మృతిచెందగా.. 15మంది తీవ్రంగా గాయపడ్డారు. తిరుపతి నుంచి కడపకు వెళ్తున్న నాన్ స్టాప్ ఆర్టీసీ బస్సు ఈ ప్రమాదానికి గురైంది. రెండు వాహనాలు వేగంగా ఢీకొట్టుకోవడంతో ప్రాణనష్టం సంభవించింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులు, 108కు సమాచారం అందించారు.
స్థానికుల సహాయంతో క్షతగాత్రులను పోలీసులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. బాధితులను రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. మరోవైపు బాధిత కుటుంబాలకు సమాచారం అందించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ప్రమాదం ఏ విధంగా జరిగిందనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
రోడ్డు ప్రమాదంపై మంత్రి మండిపల్లి దిగ్భ్రాంతి
తిరుపతి - కడప సూపర్ లగ్జరీ బస్సు ప్రమాద ఘటనపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతిచెందిన చిన్నారి పునీత్ సాయి, విద్యార్థిని యశ్విత కుటుంబాలకు మంత్రి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిపై మంత్రి ఆరా తీశారు. తీవ్రగాయాలైన వారికి మెరుగైన వైద్యం కోసం ఉన్నత వైద్య కేంద్రాలకు తరలించాలని సూచించారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని మంత్రి భరోసా ఇచ్చారు. రోడ్డు భద్రతా ప్రమాణాలు, బస్సు - లారీ వివరాలపై ఫోన్లో అధికారులతో మంత్రి మాట్లాడారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచనలు చేశారు. ప్రమాదంలో గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆకాంక్షించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.













