రాయలసీమ న్యూస్, తిరుపతి: ఆన్‌లైన్ బెట్టింగ్‌లలో భారీగా నష్టపోయి అప్పులపాలైన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి రైళ్లలో, రైల్వే స్టేషన్లలో వరుస చోరీలకు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నిందితుడిని రేణిగుంట జీఆర్‌పీ పోలీసులు అరెస్టు చేసినట్లు రేణిగుంట జీఆర్‌పీ పోలీస్ స్టేషన్ సీఐ యతీంద్ర గురువారం తెలిపారు.
స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సీఐ వివరాలు వెల్లడించారు. అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన రమేష్‌రెడ్డి ఇంజినీరింగ్ చదువు పూర్తి చేసి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడని చెప్పారు. ఉద్యోగం చేస్తూనే ఆన్‌లైన్ బెట్టింగ్‌లలో పాల్గొంటూ భారీగా నష్టపోయాడని, దాంతో పాటు పలు చెడు వ్యసనాలకు అలవాటు పడ్డాడని వివరించారు.
సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో రమేష్‌రెడ్డి రైళ్లు, రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల సామాన్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నాడని సీఐ తెలిపారు. చోరీ చేసిన నగదుతో జల్సాలు చేస్తూ విలాసవంతమైన జీవనశైలికి అలవాటు పడినట్లు దర్యాప్తులో బయటపడిందని పేర్కొన్నారు.
నిందితుడిపై గుంతకల్లు రైల్వే పోలీస్ స్టేషన్‌లో ఎనిమిది కేసులు, గుత్తి రైల్వే పోలీస్ స్టేషన్‌లో ఒక కేసు నమోదై ఉన్నట్లు సీఐ యతీంద్ర తెలిపారు. తాజాగా వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా నిందితుడి కదలికలను గమనించిన పోలీసులు, రేణిగుంట రైల్వే స్టేషన్ సమీపంలో మోహరించిన బృందంతో అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు.
అరెస్టు చేసిన రమేష్‌రెడ్డి వద్ద నుంచి రూ.4.40 లక్షల విలువైన 36 గ్రాముల బంగారం, ల్యాప్‌టాప్, డిజిటల్ కెమెరాను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరచగా, కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు.
ఈ కేసు దర్యాప్తులో ఆర్పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్సై మధుసూదన్‌రావు తదితరులు పాల్గొన్నారని సీఐ యతీంద్ర తెలిపారు. ఆన్‌లైన్ బెట్టింగ్‌లు, చెడు వ్యసనాలు యువతను నేరాలకు దారితీస్తున్న నేపథ్యంలో ఇలాంటి కార్యకలాపాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు, సంఘటనల గురించి వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు.













