తిరుపతి: తిరుమలలో భక్తులను లక్ష్యంగా చేసుకుని జేబుదొంగతనాలు, మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర నేర ముఠాను తిరుమల టూ టౌన్ పోలీసు బృందం అరెస్ట్ చేసింది. నకిలీ TTD గుర్తింపు కార్డుతో యాత్రికులను మోసం చేస్తున్న మహిళ సహా ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నగదు, నకిలీ TTD ఐడీ, సెల్‌ఫోన్లు, దొంగతనాలకు ఉపయోగించే పరికరాలు సహా పలు వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

తిరుమల టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా, విశ్వసనీయ సమాచారంపై తక్షణ స్పందన చూపిన పోలీసు బృందం ఈ నెల (27-07-2026) రాంభగీచ కార్ పార్కింగ్ ప్రాంతంలో నిందితులను పట్టుకుంది. అరెస్టు చేసిన వారు బాలాజీ అకాడే (33) – కర్ణాటక రాష్ట్రం, అప్పాషా మానే (65) – మహారాష్ట్ర రాష్ట్రం, కల్తీ రెడ్డి కీర్తి (31) – నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్‌గా గుర్తించారు.

ప్రాథమిక విచారణలో నిందితులు తిరుమలకు విచ్చేసే భక్తుల రద్దీని ఆసరాగా చేసుకుని బాలాజీ బస్ స్టాండ్, ఉచిత బస్సులు మరియు ఇతర రద్దీ ప్రాంతాల్లో జేబుదొంగతనాలు, పర్సుల చోరీలు, బ్యాగులు కత్తిరించి నగదు, విలువైన వస్తువులు అపహరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. భక్తులు దర్శనానికి, వసతికి క్యూల్లో నిలబడే సమయంలో, బస్సుల్లో ప్రయాణించే సమయంలో వీరు అవకాశాలు చూసుకుని నేరాలకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో బయటపడింది.

మహిళా నిందితురాలు కల్తీ రెడ్డి కీర్తి నకిలీ TTD గుర్తింపు కార్డు తయారు చేసుకుని తాను TTD ఉద్యోగినినని భక్తులను నమ్మిస్తూ VIP దర్శనం, ప్రత్యేక దర్శన టికెట్లు, వసతి గదులు ఏర్పాటు చేస్తానని చెప్పి యాత్రికులను మభ్యపెడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో PhonePe ద్వారా భక్తుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లు విచారణలో వెల్లడైంది.

నిందితుల వద్ద నుంచి ఒక దొంగిలించిన పర్సు, నగదు రూ.5,100/-, మోటార్ సైకిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్, PAN కార్డు, నకిలీ TTD గుర్తింపు కార్డు, మూడు సెల్‌ఫోన్లు (2 POCO, 1 Lava), కట్టర్, చిన్న కత్తి, బ్లేడ్‌లు, గిల్ట్ నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసిన సొత్తును జప్తు చేసి, నిందితులపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి గౌరవ న్యాయస్థానం ముందు హాజరుపరచడమైనది.

ప్రాథమిక విచారణలో నిందితులు గతంలో కూడా వివిధ ప్రాంతాల్లో ఇలాంటి నేరాలకు పాల్పడినట్లు బయటపడగా, వారి నేర చరిత్రపై మరింత లోతైన దర్యాప్తు కొనసాగుతోంది. తిరుమలలో భక్తులు అధికారిక TTD సేవలనే వినియోగించాలని, అనుమానాస్పద వ్యక్తుల ఆఫర్లకు లోనుకాకూడదని జిల్లా ఎస్పీ, TTD CV&SO సంయుక్తంగా సూచించినట్లు సమాచారం.