రాయలసీమ న్యూస్, తిరుపతి: తిరుపతి: తిరుపతి రూరల్ మండలంలోని దామినేడు వద్ద విలువైన ప్రభుత్వ భూములను టూరిజం పేరుతో ప్రవేట్ రియల్ ఎస్టేట్ సంస్థలకు అప్పగించడంపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత భూమన కరుణాకరరెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. క్షేత్ర స్థాయిలో భూములను పరిశీలించిన అనంతరం ఆయన ఈ ఆరోపణలు చేశారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ, తిరుపతి రూరల్ మండలంలో సుమారు రూ.600 కోట్లు విలువైన 20 ఎకరాల ప్రభుత్వ భూమిని టూరిజం పేరుతో రియల్ ఎస్టేట్ సంస్థలకు కూటమి ప్రభుత్వం అప్పగించిందని ఆరోపించారు. ఎకరాకు సుమారు రూ.90 లక్షల చొప్పున, అత్యంత తక్కువ ధరకు ఈ భూములను అప్పగించారని ఆయన విమర్శించారు.
ఈ వ్యవహారంలో మంత్రి నారా లోకేష్ పాత్రపై కూడా భూమన కరుణాకరరెడ్డి సందేహాలు వ్యక్తం చేశారు. ఈ భూముల కేటాయింపులో సుమారు రూ.200 కోట్లు తెర వెనుక చేతులు మారాయని ఆయన ఆరోపించారు. రాబోయే రోజుల్లో ఈ 20 ఎకరాల భూమి విలువ సుమారు రూ.2 వేల కోట్లకు చేరుకునే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
తిరుపతి కలెక్టరేట్‌కు అత్యంత సమీపంలో ఉన్న ఈ విలువైన భూమిని ప్రభుత్వ ప్రయోజనాలకు వినియోగించకుండా, ప్రవేట్ సంస్థలకు దోచిపెట్టారని భూమన కరుణాకరరెడ్డి విమర్శించారు. తిరుపతి వన్ పేరుతో ఈ భూములను దివ్యశ్రీ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ , సైబర్ సిటీ బిల్డింగ్ అండ్ డెవలప్మెంట్ సంస్థలకు అప్పగించారని ఆయన తెలిపారు.
దామినేడు ప్రాంత భూముల విషయంలో స్థానిక ప్రజలకు ఒక్క సెంటు భూమి కూడా ఇవ్వకుండా, ప్రవేట్ రియల్ ఎస్టేట్ సంస్థలకు కేటాయించడం అన్యాయమని భూమన కరుణాకరరెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ ప్రాంతంలో ప్రవేట్ రియల్ ఎస్టేట్ సంస్థలకు భూములు ఇవ్వడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
అలిపిరి వద్ద సుమారు రూ.300 కోట్లు విలువైన TTD భూమిని ఒబెరాయ్ హోటల్ కు కేటాయించిన విషయాన్ని కూడా భూమన కరుణాకరరెడ్డి ప్రస్తావించారు. దామినేడు వద్ద రూ.600 కోట్లు విలువైన ప్రభుత్వ భూమిని ప్రవేట్ వ్యక్తులకు, రియల్ ఎస్టేట్ సంస్థలకు అప్పగించడం ప్రభుత్వ భూముల దోపిడీకి నిదర్శనమని ఆయన ఆరోపించారు.













