రాయలసీమ న్యూస్, ఎంటర్టైన్మెంట్ డెస్క్: గత మూడు సంవత్సరాలుగా ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్న సమయంలో తన భార్య జైనబ్ అండగా నిలిచి, ధైర్యం చెప్పిందని నటుడు అఖిల్ పేర్కొన్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన లెనిన్ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయాన్ని సాధించిన నేపథ్యంలో గుంటూరులో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అఖిల్ తన కుటుంబం, అభిమానులు, తన కెరీర్ ప్రయాణం గురించి భావోద్వేగంగా మాట్లాడారు.
లెనిన్ విజయంపై ఆనందం వ్యక్తం చేసిన అఖిల్ , ఈ చిత్రాన్ని విజయవంతం చేయడానికి కష్టపడ్డ చిత్రబృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితంలో భార్య జాఇన్బ , తండ్రి నాగార్జున , అభిమానులు పోషించిన పాత్రను ప్రత్యేకంగా ప్రస్తావించారు.
తన కెరీర్ ప్రయాణంలో అభిమానుల ప్రాధాన్యతను వివరించిన అఖిల్ , వారి ప్రేమ, మద్దతు వల్లే తాను ఈ స్థాయికి చేరుకున్నానని భావోద్వేగంగా పేర్కొన్నారు.
‘‘ఎన్నో జన్మల పుణ్యం చేస్తే ఇలాంటి అభిమానులు దొరుకుతారు. ఫ్యాన్స్ కోసం అయినా హిట్ కొట్టాలని మా ఆవిడతో ఎప్పుడూ చెప్పేవాడిని. నన్ను నమ్మిన ప్రేక్షక దేవుళ్లందరికీ ఒక్కటే మాట చెబుతున్నాను. నేనేం కాలర్ ఎగరేయను.. విజయం సాధించాం అని గర్వపడను. ఇప్పటి నుంచి నా కొత్త ప్రయాణం మొదలవుతోంది. నేను చేయాలనుకుంటున్న యుద్ధాన్ని ప్రశాంతంగా చేస్తాను’’ అని అన్నారు.
లెనిన్ విజయంతో అఖిల్ కెరీర్‌లో కొత్త దశ ప్రారంభమైందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. కుటుంబం, అభిమానుల మద్దతుతో ముందుకు సాగుతున్నానని ఆయన ఈ సందర్భంగా మరోసారి స్పష్టం చేశారు.







