రాయలసీమ న్యూస్, ఎంటర్టైన్మెంట్ డెస్క్:
జీవితాన్ని ఆవిష్కరించిన ‘దీవాన’ : శ్రీవిష్ణు అభినందనలు
జీవితాన్ని ఎంతో లోతుగా ఆవిష్కరించిన అందమైన చిత్రంగా ‘దీవాన’ సినిమాను ప్రముఖ కథానాయకుడు శ్రీవిష్ణు అభివర్ణించారు. ఇలాంటి చిత్రాలకు ప్రతి ఒక్కరి ప్రోత్సాహం దక్కాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌లో శుక్రవారం నిర్వహించిన ‘దీవాన’ థ్యాంక్యూ మీట్‌కు శ్రీవిష్ణు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
హర్షిత్‌రెడ్డి కథానాయకుడిగా, శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. స్నేహ మణిమేగలై కథానాయికగా నటించగా, వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి ఈ సినిమాను నిర్మించారు.
ఈ సందర్భంగా శ్రీవిష్ణు చిత్రంపై తన అభిప్రాయాలను వెల్లడించారు.
తెలుగు సినిమాల్లో ఇప్పటివరకూ చూడని విరామ సన్నివేశాలు ‘దీవాన’లో ఉన్నాయి. ఇందులో కేవలం ప్రేమకథ మాత్రమే కాదు. జీవితం కూడా ఉంది. హర్షిత్‌రెడ్డి చాలా సహజంగా నటిస్తాడు. శనివారం నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఆడుతున్న థియేటర్లలో తొలి 25 టికెట్ల వరకూ ఒక టికెట్ కొన్నవాళ్లకు మరొక టికెట్ ఉచితంగానే ఇస్తారు. సినిమా నచ్చిందంటే మరొకరిని థియేటర్‌కు తీసుకెళ్లాల.
కథానాయకుడు హర్షిత్‌రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో మాట్లాడారు. కొత్తవాళ్లు కలిసి చేసిన తమ సినిమా తొలి వారాంతం తర్వాత కూడా థియేటర్లలో మంచి ప్రేక్షకాదరణ పొందుతుండటం తమకు నిజమైన విజయమని ఆయన అభిప్రాయపడ్డారు.
కొత్తవాళ్లం కలిసి చేసిన మా సినిమా తొలివారం తర్వాత కూడా థియేటర్లలో 70 శాతం ప్రేక్షకులతో కళకళలాడుతోందంటే అదే మాకు దక్కిన నిజమైన విజయం. ప్రేక్షకులు మా సినిమాలోని ప్రతి పాత్రనీ గుర్తు పెట్టుకుంటున్నారు. సొంతం చేసుకుంటున్నారు. అది కూడా మా విజయమే. విరామంలో వచ్చే మలుపు బాగుందని అంతా చెప్పుకుంటున్నారు కానీ, ఎక్కడా అది బయట పెట్టడం లేదు. అలా మా సినిమాని ప్రేక్షకులే కాపాడుకుంటున్నారు.
థ్యాంక్యూ మీట్‌లో నటులు వీకే నరేశ్, రఘు కారుమంచి, టోనీ, కేకే, నర్సింగ్ వాడేకర్, సింధు తదితరులు పాల్గొన్నారు. చిత్రబృందం సినిమా విజయంపై సంతోషం వ్యక్తం చేస్తూ, ప్రేక్షకుల మద్దతుకు కృతజ్ఞతలు తెలిపింది.







