జాతీయ చలనచిత్ర అవార్డులు : ఈసారి ‘హీరో’ ఎవరవుతారో..?

72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటనకు మరికొద్ది గంటలే మిగిలి ఉండటంతో సినీ అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా ఉత్తమ నటుడు విభాగంలో ఈసారి పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారింది. విభిన్న కథలు, వైవిధ్యమైన పాత్రలు, అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఐదుగురు నటుల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. వారిలో తెలుగు నుంచి అల్లు అర్జున్‌ ఉండగా, మలయాళం నుంచి సీనియర్‌ నటుడు మమ్ముట్టి కూడా ఈ రేసులో ఉన్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. వీరితో పాటు మరో ముగ్గురు నటుల పేర్లు కూడా నెట్టింట వైరల్‌గా మారాయి.

మలయాళ చిత్రం ‘భ్రమయుగం’తో మమ్ముట్టి మరోసారి తన నటన ప్రతిభను చాటుకున్నారు. నటనకు చిరునామాగా పేరుపొందిన మమ్ముట్టి ఈ చిత్రంలో మిస్టరీ, భయానక అంశాల నడుమ తన పాత్రను ఆవిష్కరించిన తీరు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. జాతీయ అవార్డుల జ్యూరీని మెప్పించే స్థాయి ప్రదర్శనగా ఇది నిలుస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

తెలుగు నుంచి అల్లు అర్జున్‌ వరుసగా రెండోసారి జాతీయ అవార్డు రేసులో నిలిచే అవకాశాలపై అభిమానుల్లో చర్చ సాగుతోంది. ‘పుష్ప’ సినిమాతో గత ఏడాది ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్న ఆయన, దాని సీక్వెల్‌ ‘పుష్ప: ది రూల్‌’లో నటనను మరో మెట్టు ఎక్కించినట్లు అభిమానులు సోషల్‌ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ పాత్రకు వచ్చిన ఆదరణ, ఆయన నటనకు లభించిన ప్రశంసలు ఈసారి కూడా జాతీయ అవార్డు పోటీలో ఆయనను బలమైన అభ్యర్థిగా నిలిపాయని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

తమిళ నటుడు విక్రమ్‌ కూడా ఈ జాబితాలో ఉన్న మరో బలమైన పేరు. పాత్ర కోసం తనను తాను పూర్తిగా మార్చుకునే నటుడిగా పేరుపొందిన విక్రమ్‌, ‘తంగలాన్‌’ కోసం కూడా శారీరకంగా, మానసికంగా పూర్తిగా రూపాంతరం చెందారు. పాత్రలో ఒదిగిపోయిన ఆయన నటన చిత్రానికి ప్రధాన బలంగా నిలిచిందని విమర్శకులు పేర్కొంటున్నారు. ఈసారి జాతీయ అవార్డుల పోటీలో విక్రమ్‌ పేరు గట్టిగానే వినిపిస్తోంది.

మలయాళ చిత్రం ‘మంజుమ్మల్ బాయ్స్‌’లో నటించిన సౌబిన్ షాహిర్‌ కూడా ఉత్తమ నటుడు విభాగంలో రేసులో ఉన్న మరో పేరు. 2024లో టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా నిలిచిన ఈ చిత్రంలో స్నేహం నేపథ్యంలో సాగిన కథలో ఆయన నటన ప్రత్యేకంగా ఆకట్టుకుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇతర పాత్రలకు కూడా సమాన ప్రాధాన్యం ఉన్న ఈ చిత్రంలో సౌబిన్‌ తన ప్రత్యేకతను చాటుకున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరో మలయాళ నటుడు ఆసిఫ్ అలీ కూడా ‘కిష్కింద కాండం’ చిత్రంతో జాతీయ అవార్డు రేసులోకి వచ్చారు. మలయాళ చిత్రసీమలో వైవిధ్యమైన పాత్రలతో గుర్తింపు పొందిన ఆయన, ఈ చిత్రంలో పాత్రలోని అంతర్మథనాన్ని సహజంగా ఆవిష్కరించిన తీరు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దీంతో ఉత్తమ నటుడు విభాగంలో ఆసిఫ్‌ పేరు కూడా చర్చనీయాంశమైంది.

మొత్తంగా ఈసారి ఉత్తమ నటుడు విభాగంలో పోటీ అత్యంత ఆసక్తికరంగా మారింది. మమ్ముట్టి, అల్లు అర్జున్‌, విక్రమ్‌, సౌబిన్ షాహిర్‌, ఆసిఫ్ అలీ లలో జాతీయ అవార్డు ఎవరిని వరించబోతుందన్నది మరికొద్ది గంటల్లోనే తేలనుంది.