రాయలసీమ న్యూస్, ఎంటర్టైన్మెంట్ డెస్క్: తెలుగు సినీ పరిశ్రమలో కీలక విభాగంగా ఉన్న తెలుగు సినీ డాన్సర్స్ యూనియన్‌లో అంతర్గత విభేదాలు తీవ్ర రూపం దాల్చాయి. అసోసియేషన్ అధికార పగ్గాలు, గుర్తింపు విషయంలో ఇరు వర్గాల మధ్య నెలకొన్న వివాదం చివరకు రాయదుర్గం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది.
ప్రముఖ కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్, యూనియన్ నాయకురాలు సుమలత ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేస్తూ పరస్పరం పోలీసులకు ఫిర్యాదులు సమర్పించారు. రఘు మాస్టర్ నాయకత్వంలోని ప్రస్తుత కార్యవర్గానికి అసోసియేషన్ నిబంధనల ప్రకారం ఎలాంటి చట్టబద్ధత లేదని సుమలత తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
యూనియన్ వ్యవహారాలను అక్రమంగా చేతుల్లోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, బ్యాంక్ ఖాతాల నిర్వహణ కోసం ఫోర్జరీ సంతకాలు, తప్పుడు పత్రాలను సమర్పించారని ఆమె ఆరోపించారు. అసోసియేషన్ నిధులను దుర్వినియోగం చేస్తున్నారని, ఈ వ్యవహారంపై చట్టపరమైన విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని సుమలత పోలీసులు కోరారు.
సుమలత వర్గం చేసిన ఆరోపణలను రఘు మాస్టర్ తీవ్రంగా ఖండించారు. తమ కార్యవర్గమే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైందని, తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అనుబంధ ఫెడరేషన్ పూర్తి మద్దతు, అధికారిక గుర్తింపు తమ ప్యానెల్‌కే ఉందని ఆయన స్పష్టం చేశారు.
కొందరు కావాలనే అసోసియేషన్ కార్యకలాపాలను అడ్డుకోవడానికి, యూనియన్ ప్రతిష్టను దెబ్బతీయడానికి తప్పుడు ప్రచారం చేస్తున్నారని రఘు మాస్టర్ ఆరోపించారు. తమ హక్కులను కాపాడాలని, విధులకు ఆటంకం కలిగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
ఇరు వర్గాల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన రాయదుర్గం పోలీసులు విచారణ ప్రారంభించారు. అసోసియేషన్ బైలాస్, ఫెడరేషన్ నిబంధనలు, అలాగే బ్యాంకుకు సమర్పించిన పత్రాల ప్రామాణికతను పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
తెలుగు సినీ డాన్సర్స్ యూనియన్‌లో నెలకొన్న ఈ వివాదం ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. డాన్సర్ల సంక్షేమం కోసం పని చేయాల్సిన సంఘంలో ఇలాంటి ఘర్షణలు చోటుచేసుకోవడం పట్ల సాధారణ కళాకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూనియన్‌లో కొనసాగుతున్న ఈ అంతర్గత పోరు త్వరలో ఏ దిశగా మలుపు తిరుగుతుందో చూడాల్సి ఉంది.






